Global Investors Summit: కడప, నడికుడి లో సిమెంట్ ఫ్యాక్టరీలు.... అంబానీ, అదానీల పెట్టుబడులు ఎంతంటే...
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇందుకు వేదికైంది.
రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు...
ఆంధ్రప్రదేశ్‌లో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సీఈఓ, గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ ప్రకటించారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కడప, నడికుడిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖలో 400 MW డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 100 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు నిర్వహిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు, ఈ పోర్టులను ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీస్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో 15వేల మెగావాట్ల పునరుత్పాదక పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదానీ ఫౌండేషన్ సేవలను ఏపీకి విస్తరించనున్నట్లు తెలిపారు.
చదవండి: మొదటిరోజే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్
ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో కేజీ డి-6 బేసిన్‌లో రూ.1.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు. ఇక్కడి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు 30 శాతం మేర దేశీయ అవసరాలను తీరుస్తోందని చెప్పారు. భారత అభివృద్ధిలో ఏపీ ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.