Global Investors Summit: ఏపీలో పెట్టుబడుల ప్రవాహం... మొదటిరోజే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామిక వేత్తలకు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. సమ్మిట్‌లో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నైపుణ్య కాలేజీల ఏర్పాటు
దేశానికి నాయకత్వం వహించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని సీఎం జగన్ కొనియాడారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రమని ఈ సందర్భంగా ఆయన గుర‍్తు చేశారు. పరిశ్రమల అవసరాల్ని తీర్చేలా అంతర్జాతీయ స్థాయిలో 26 నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు ఏ సమస్య ఉన్న, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. అలాగే, త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని తేల్చి చెప్పారు.
చదవండి: త్వరలో విశాఖ నుంచే పరిపాలన..: సీఎం వైఎస్ జగన్
రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నానని జగన్ అన్నారు. ‘‘ సమ్మిట్‌లో 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. తొలిరోజు 92 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. రెండు రోజుల్లో మొత్తం 340 ఎంవోయూలు కుదుర్చుకోబోతున్నాం. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సీఎం జగన్ తెలిపారు.