Skip to main content

Hurun Rich List: అత్యంత సంపన్నుల జాబితాలో.. అంబానీని మళ్లీ దాటేసిన అదానీ

పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ (62) భారతదేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు.
Gautam Adani Replaces Mukesh Ambani as India's Richest Person

మరోసారి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ.11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్ ఆగ‌స్టు 29వ తేదీ విడుదల చేసిన సంపన్నుల జాబితా–2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు పడిపోయింది.

అప్పుడు అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ.10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు. 

తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ.1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి రూ.159 లక్షల కోట్లకు చేరింది.  

GST Collections: జీఎస్‌టీ వసూళ్లు.. 1.82 ల‌క్ష‌ల కోట్లు!

ముఖ్యాంశాలు.. 
➣ హురున్‌ టాప్‌–5 జాబితాలో హెచ్‌సీఎల్‌ అధిపతి శివ్‌ నాడార్‌ (రూ.3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్‌ పూనావాలా (రూ.2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వి రూ.2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు.  
➣ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.

టాప్‌–3లో హైదరాబాద్‌.. 
17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్‌ తొలిసారిగా బెంగళూరును  అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 
అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్‌), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్‌.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్‌), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్‌), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్‌), ప్రతాప్‌ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్‌కేర్‌), పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు. 

Largest Economy: భారత్ వైపే గ్లోబల్‌ ఇన్వెస్టర్ల చూపు.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దు

Published date : 31 Aug 2024 09:38AM

Photo Stories