Skip to main content

April 22 Curent Affairs: ఇక‌పై త‌మిళ‌నాడులో వారానికి నాలుగు రోజులే ప‌నిదినాలు

1. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌ నుంచి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్ర‌యోగించిన‌ పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి55 ప్రయోగం విజ‌య‌వంత‌మైంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్‌-2, 16 కిలోల లూమోలైట్‌-4 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లనుంది. టెలీయోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందినది.
April 22nd Curent Affairs
April 22nd Curent Affairs

దీన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం.

Isro


2. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో రోజువారీ పని వేళలను 12 గంటలకు, అలాగే పనిదినాలను 4 రోజులకు తగ్గించే బిల్లును తమిళనాడు శాసనసభ ఆమోదించింది. బడ్జెట్‌ సమావేశాల్లో ఆఖరి రోజైన శుక్రవారం కార్మికశాఖ మంత్రి సీవీ గణేశన్‌ ప్రవేశపెట్టిన బిల్లును ప్రతిపక్షాలతోపాటు డీఎంకే కూటమిలోని పార్టీల సభ్యులూ వ్యతిరేకించారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
3. కేరళ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్‌ అదే కోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులయ్యారు. ఆర్టికల్‌ 223 ప్రకారం ఆయన నియామకానికి రాష్ట్రపతి శుక్రవారం ఆమోదం తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు.

judge

ప్రస్తుతం కేరళ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఎస్‌.మణికుమార్‌ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఎస్వీ భట్‌ స్వస్థలం అన్నమయ్య జిల్లా మదనపల్లె.
4. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే మహారాష్ట్ర చట్టాన్ని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే సంబంధిత చట్టాన్ని కొట్టేస్తూ 2021 మే 5న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపం కనిపించలేదని పేర్కొంది.
5. 2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్‌ నేతృత్వంలో ‘స్టేట్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ క్లైమెట్‌ 2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. గతేడాది తీవ్ర వరదలు, రికార్డు స్థాయి వేడి గాలులు, కరవు పరిస్థితుల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందని తెలిపింది.

Floods

పారిశ్రామిక విప్లవానికి ముందు (1850-1900) సరాసరి కంటే 1.15 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉందని వెల్లడించింది. అలాగే అంటార్కిటిక్‌ సముద్ర మంచు, యూరోపియన్‌ ఆల్ప్స్‌ హిమానీనాదాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
6. అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ అమెరికన్‌ రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ నియామకాన్ని అమెరికా సెనెట్‌ 68-30 ఓట్లతో ఆమోదించింది. రక్షణశాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఈ పదవికి రాధా అయ్యంగార్‌ను అధ్యక్షుడు జో బైడెన్‌ 2022 జూన్‌లో నామినేట్‌ చేశారు. రక్షణ శాఖ ఉప మంత్రికి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్న రాధకు పదోన్నతి ఇచ్చారు.
7. పాకిస్తాన్‌లో భారత టీవీ చానళ్ల ప్రసారాలను నిషేధిస్తూ పాకిస్తాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ సంస్థ (పెమ్రా) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అతిక్రమించే కేబుల్‌ ఆపరేటర్ల మీద తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సంద‌ర్భంగా కరాచీ, సింధ్‌ హైదరాబాద్‌, పంజాబ్‌లోని ముల్తాన్‌లలో కేబుల్‌ ఆపరేటర్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
8. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం దాదాపు 6 గంటల పాటు జ‌రిగిన తొమ్మిదో గేమ్‌లో డింగ్‌ లిరెన్‌ (చైనా)-ఇయాన్‌ నెపోమ్నిషి (రష్యా) పాయింట్లు పంచుకున్నారు. సుదీర్ఘంగా సాగిన పోరులో లిరెన్‌-నెపోమ్నిషి 82 ఎత్తుల్లో డ్రాకు అంగీకరించారు. మరో అయిదు రౌండ్లు మిగిలున్న ఈ సమరంలో నెపోమ్నిషి 5-4తో లిరెన్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. ఇయాన్‌ 2, 5, 7 గేమ్‌లు నెగ్గగా.. లిరెన్‌ 4, 6 గేమ్‌లు గెలిచాడు. నాలుగు గేమ్‌లు డ్రాగా ముగిశాయి.
9. కాలం చెల్లిన జీశాట్‌–12 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. 2011 జులై 15న పీఎస్‌ఎల్‌వీ సీ17 రాకెట్‌ ద్వారా జీశాట్‌–12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. శుక్రవారంతో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది.
10. భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు ఏప్రిల్‌ 14వ తేదీతో ముగిసిన వారంలో 1.657 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ నిల్వల పరిమాణం మొత్తం 586.412 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతక్రితం వారమూ (ఏప్రిల్‌ 7తో ముగిసిన) విదేశీ మారక నిల్వలు భారీగా 6.306 బిలియన్‌ డాలర్లు ఎగశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Forex

2021 అక్టోబర్‌లో భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు 645 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి  100 బిలియన్‌ డాలర్లుకుపైగా పడిపోయాయి.

Published date : 22 Apr 2023 06:39PM

Photo Stories