Skip to main content

Current Affairs: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా

స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సెక్రెటరీ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
Ajay banga
Ajay banga

స్వలింగ జంటలకు జాయింట్‌ బ్యాంకు ఖాతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్‌ పథకాల్లో స్వలింగ భాగస్వామిని నామినీగా చేర్చడం వంటివాటిపై నెలకొన్న సమస్యలను ఏప్రిల్‌ 27 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తీర్పు వెలువరిస్తామని సీజేఐ పేర్కొన్నారు.

మ‌ళ్లీ కూలిన ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌
భారత సైన్యానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఏఎల్‌హెచ్‌ ధ్రువ్ ఛాపర్‌ గురువారం జమ్మూకశ్మీర్ లోని కిష్త్వార్‌ జిల్లాలో కుప్పకూలింది. మార్వా అటవీ ప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. కాగా.. ధ్రువ్‌ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురవడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి 8న నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌.. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటన తర్వాత ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు.

supreme court

మీడియా స్వేచ్ఛ‌లో దిగ‌జారిన భార‌త్ ర్యాంక్‌
మీడియా స్వేచ్ఛలో భారత్‌ మరింత దిగువకు పడిపోయింది. ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచి-2023లో 161వ స్థానానికి భార‌త్‌ పరిమితమైంది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి 11 ర్యాంకులు పడిపోయి 161కి చేరింది. రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే గ్లోబల్‌ మీడియా వాచ్‌డాగ్‌ ప్రతి ఏడాది ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురిస్తుంటుంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంటుంది. సమస్యాత్మకం నుంచి అత్యంత దారుణ పరిస్థితికి తుర్కియే, భారత్‌, తజికిస్థాన్‌ చేరుకున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది.

బల్వంత్‌సింగ్‌ రాజోనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్‌సింగ్‌ రాజోనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో రాజోనా మరణశిక్షను జీవితఖైదుగా మార్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అతడి క్షమాభిక్ష పిటిషన్‌పై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని సుప్రీం స్ప‌ష్టం చేసింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా 1995లో చండీగఢ్‌ సచివాలయం ముందు జరిగిన పేలుడులో అప్పటి పంజాబ్‌ సీఎం బియాంత్‌సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో అప్పటికి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌సింగ్‌ రాజోనా ప్రమేయమున్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

ఇక‌నుంచి సాయుధ బ‌ల‌గాల‌కు తృణధాన్యాలు
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్‌), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బందికి ఇకపై భోజనంలో 30 శాతం మేర తృణధాన్య పదార్థాలు అందించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకొంటున్న 2023లో, సీఏపీఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి భోజనంలో తృణధాన్య పదార్థాలను అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

జులై చివరి నాటికి ఎల్‌నినో పరిస్థితి
ఈ ఏడాది జులై చివరి నాటికి ఎల్‌నినో పరిస్థితి తిరిగివచ్చే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పోకడల్లో మార్పు చోటు చేసుకుంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తెలిపింది. పసిఫిక్‌ మహా సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్‌నినో రానుంది. లానినా వ‌రుస‌గా మూడేళ్లు కొనసాగడం అరుదైన రికార్డుల్లో ఒకటనీ, ఆ పోకడకు ఎల్‌నినో తెరదించుతుందని ఈ సంస్థలోని ప్రాంతీయ వాతావరణ అంచనాల విభాగాధిపతి విల్ఫ్రాన్‌ మౌఫౌమా ఓకియా చెప్పారు.

mexico

మెక్సికోకు కుక్క‌పిల్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ టర్కీ 
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్‌ కుక్కపిల్లను బ‌హుమ‌తిగా ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ స‌మ‌యంలో అక్క‌డ మెక్సికో రెస్క్యూ డాగ్‌లను మోహరించింది. అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది.

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షునిగా భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా ఎంపికయ్యారు. ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు. జూన్‌ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్‌ అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంక్‌ పగ్గాలు  చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఈ పదవికి నామినేట్ చేశారు. బంగా జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్‌కార్ట్‌ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

చురుగ్గా హైడ్రోజన్‌ రైలు ప్రాజెక్టు పనులు
దేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు ప్రాజెక్టు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ట్రయల్స్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బుధవారం రైల్వే బోర్డు చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లహోటీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును ఉత్తర రైల్వేకు ఇచ్చాం.. అంతర్జాతీయ స్థాయిలో హైడ్రోజన్‌ రైలు.. ఓ కొత్త సాంకేతికత. అందుకే కఠిన కాలావధులను నిర్దేశించుకుంటూ, సమర్థవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆయ‌న‌ పేర్కొన్నారు.

రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు నవరత్న హోదా
రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. రైల్వే సామర్థ్యాన్ని పెంచే మౌలిక వసతులను వేగవంతంగా అమలు చేయడంతో పాటు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ప్రాజెక్టులకు బడ్జెటేతర మార్గాల్లో నిధుల సమీకరణ చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2005 నుంచి ఇది తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2013లో దీనికి మినీరత్న హోదా దక్కింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆథరైజ్డ్‌ షేర్‌ కేపిటల్‌ రూ.3వేల కోట్లు, పెయిడ్‌ అప్‌ షేర్‌ కేపిటల్‌ రూ.2,085 కోట్ల మేర ఉంది.

Published date : 04 May 2023 07:03PM

Photo Stories