LK Advani To Be Honoured With Bharat Ratna- ఎల్‌కే అద్వానికి భారతరత్న.. మోదీ కీలక వ్యాఖ్యలు
మాజీ ఉప ప్రధాని, బీజీపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ(96)కి అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అని ప్రశంసించారు.
అద్వానీకి భారతరత్న.. మోదీ కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారనే వార్తను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను.
ఎల్‌కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంటులో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి'' అంటూ మోదీ ట్వీట్ చేశారు.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024
కరాచీలో జననం, 14 ఏళ్ల వయసులోనే..
ఎల్‌కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్(భారత్ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. 14 ఏళ్ల వసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో (1941లో) చేరారు.
తొలిసారి రాజ్యసభకు..
1966లో జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1970 వరకూ ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1970లో అద్వానీ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989 వరకూ నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు.
1989లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2002 – 2004 దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు.
దేశ అత్యున్నత పురస్కారం
అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు. ఇక 2015లో అద్వానీ భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ఇప్పుడు భారతరత్న పురస్కారాన్ని అందుకోనున్నారు.