ఏ ఇంటర్వ్యూలోనైన..విజయం సాధించాలంటే ఇవి తప్పనిసరి..!
చాలామంది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలో తెలియక అవకాశాలను కోల్పోతుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. సులభంగానే ఇంటర్వ్యూలో సక్సెస్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
సంస్థ గురించి..
ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి అధ్యయనం చేసి..అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దరఖాస్తు చేసిన ఉద్యోగం, నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలపైనా అవగాహన కలిగి ఉండాలి.
మంచి వస్త్రధారణ..
ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్త్రధారణ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే రిక్రూటర్లు అభ్యర్థిని త్వరగానే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి.
కాస్త ముందుగానే..
సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కంటే.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లేలా చూసుకోవాలి. దాంతో అనవసరపు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి చేరుకోవడమో లేదా ఆలస్యంగా వెళ్లడమో చేస్తే గందరగోళ పరిస్థితి తలెత్తే ప్రమాదముంది.
హుందాగా వ్యవహరించాలి
సంస్థలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. గేట్ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి.. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా.. సంస్థలో ఎంతో మంది ఎదురవుతారు. వీరందరితో హుందాగా ప్రవర్తించాలి. కరచాలనం, పలకరించే సందర్భాల్లో పద్ధతిగా మసలుకోవాలి. ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష, భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి.
ఇది చాలా ముఖ్యం..
ఇంటర్వ్యూ చేసేవారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. అంతేతప్ప ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. ఏదో ఒకటి చెబితే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగానే గుర్తిస్తారు.
ఇలాంటి చేష్టలు అస్సలు చేయకూడదు..
ఇంటర్వ్యూలో హావభావాలు కూడా ముఖ్యమే. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాళ్లు కదపడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వంటి చేష్టలు అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండటం, అవసరమైతే సందర్భానుసారంగా చిరునవ్వు చిందించడం అవసరం.
ఇవి మరిచిపోవద్దు..
ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు జాబ్ అప్లికేషన్‌తోపాటు రెజ్యూమ్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్‌లో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత చివర్లో బోర్డ్ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం మరిచిపోవద్దు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూ గట్టెక్కి.. కోరుకున్న కొలువు సొంతమవుతుంది!!