Andhra Pradesh: కేంద్రీయ గిరిజన వర్సిటీ
సాక్షి: కేంద్రీయ గిరిజన వర్సిటీ... రాష్ట్ర విభజన హామీల్లో ఏపీకి దక్కిన విద్యామణిహారం. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృషితో 561.88 ఎకరాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సాలూరు నియోజకవర్గంలోని చినమేడపల్లి వద్ద పునాదిరాయి పడిన వేళ.. విద్యార్థిలోకం హర్షధ్వానాలు చేసింది. జై జగన్ అంటూ నినదించింది. ఉత్తరాంధ్ర విద్యాప్రగతికి గిరిజన వర్సిటీ సోపానం కానుందని పేర్కొంది. గిరిజన వర్సిటీతో ఉత్తరాంధ్రలో
దత్తిరాజేరు మండలం మరడాం వద్ద సభావేదికపై సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్, మంత్రులు బొత్ససత్యనారాయణ, పీడిక రాజన్నదొర, ఎంపీ గొడ్డేటిమాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, వీసీ కట్టమణి తదితరులు
కేంద్రీయ గిరిజన వర్సిటీ నిర్మాణానికి సాలూరు నియోజకవర్గంలోని చినమేడపల్లి వద్ద శుక్రవారం నిర్వహించిన భూమిపూజ అట్టహాసంగా సాగింది. గిరిజన వర్సిటీతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వేళ... ఈ ప్రాంత ప్రజలంతా చప్పట్లతో స్వాగతించారు. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వెనుకాడడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గిరిజనుల పట్ల, వెనుకబడిన జాతులు, తెగల పట్ల తమ అనుకూల వైఖరిని సుప్పష్టం చేశారు. దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోని పార్వతీపురంమన్యం, విజయనగరం ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విప్లవాత్మకమైన మార్పులు సంతరించుకుంటున్నాయని ఉదాహరణలు, వివరణలతో ప్రజలకు తెలియజేశారు. ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూ ల్ ప్రకారం 11.05 గంటలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్‌లు ముందుగా చినమేడపల్లిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన అనంతరం గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. వీరికి అంతకు ముందు హెలిప్యాడ్ వద్ద జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని నమ్మే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్పులు చేస్తున్న విషయాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా విడమర్చి చెప్పారు. అభివృద్ధిని చేసి చూపుతున్నామన్నారు. తాజాగా గిరిజన ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా 561.88 ఎకరాల విస్తీర్ణంలో రూ.830 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి పూజచేసినట్టు వెల్లడించారు.
గతానికి భిన్నంగా...
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన గత పర్యటనలకు భిన్నంగా సాగింది. ప్రతిపక్షంపై ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేయకపోగా... వైఎస్సార్‌సీపీ హయాంలో గత నాలుగేళ్ల మూడు నెలల కాలంలో అమలు చేసిన పథకాలను, ప్రజల కు చేసిన లబ్ధిని వివరిస్తూ ప్రసంగించారు. ప్రభు త్వ హయాంలో గిరిజనులకు చేసిన మేలును వివరించిన ముఖ్యమంత్రి... గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులను రానున్న మూడేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రశాంతత, హుందాతనం కలగలపిన వాతావరణంలో గిరిజన విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయడం తో పాటు క్లుప్తమయిన ప్రసంగాలతో సభ ముగిసింది.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రికి జేసీ కె.మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ సహజిత్ వెంకట త్రినాథ్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పిసురేష్ బాబు, ఇందుకూరు రఘురాజు, దువ్వాడ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర రావు, మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకట కృష్ణారెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు.
చదవండి:
Kasturba Vidyalayas: కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడుతున్న కస్తూర్బా విద్యాలయాలు