Arts College: ఆర్ట్స్ కళాశాలకు స్టార్ హోదా
వైవీయూ : భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని న్యూఢిల్లీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ‘స్టార్ కాలేజ్’ ప్రోగ్రాంకు కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల ఎంపికై ంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఏడు కళాశాలలు దరఖాస్తు చేసుకోగా.. ఈ ప్రోగ్రాంకు ఆర్ట్స్ కళాశాల ఎంపికై ంది.
ఈ ఏడాది జూలై 13, 14వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.జి.రవీంద్రనాథ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.వై.సావిత్రిల బృందం ఇచ్చిన ప్రెజెంటేషన్ వారికి నచ్చడంతో నిధులు విడుదలకు ఆమోదం తెలిపారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఈ ప్రోగ్రాం కింద ఏపీ నుంచి కడప ఆర్ట్స్ కళాశాలకు మాత్రమే అవకాశం దక్కింది.
1948 నుంచి నేటి వరకు..
యువతకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో 1948లో ఏర్పాటైన ఈ కళాశాలకు.. 1952లో అప్పటి ముఖ్యమంత్రి సర్ సి.వి.రాజగోపాలాచారి చేతుల మీదుగా పునాదిరాయి పడింది. నేడు అదే ప్రాంతంలో ఆకట్టుకునే భవన నిర్మాణాలతో ఆర్ట్స్ కళాశాలగా రూపుదిద్దుకొంది. ఎందరో విద్యార్థుల ను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన చదువుల కోవెల మరో మైలురాయికి చేరువలో నిలిచింది.
మద్రాసు ప్రభుత్వంలో 1948లో ఏర్పాటైన ఈ విద్యాలయం దాదాపు 75 సంవత్సరాల పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు విద్యా సుగంధాలు వెదజల్లుతూనే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనుబంధంతో ఏర్పాటైన ప్రభుత్వ పురుషుల కళాశాల ఆర్ట్స్ కళాశాలగా ప్రారంభమైంది. అనంతరం 1968లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, 2008 లో కడప యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. 2012–13లో స్వయంప్రతిపత్తి సాధించి అటానమస్ హోదాతో యేటా దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులకు సేవలందిస్తోంది.
ప్రత్యేక నిధులు..
స్టార్ కళాశాల ప్రోగ్రాం కింద ఎంపికై కళాశాలలకు డీబీటీ వారు యేడాదికి రూ.1 కోటి చొప్పున నిధులను కేటాయిస్తారు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలకు సంబంధించి ఒక్కో విభాగానికి రూ.15 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తారు. పరిశోధన, మౌలిక సదుపాయాలు, టూర్స్, ప్రాజెక్టులు, సెమినార్లు, కాన్ఫరెన్స్‌ల నిర్వహణ అంశాలకు నిధులను వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తారు.
ఇలా మూడేళ్ల పాటు యేడాదికి రూ.1 కోటి చొప్పున నిధులను విడుదల చేస్తారు. అనంతరం రెండో సైకిల్‌లో ఇదే ప్రగతి కొనసాగితే ‘స్టార్ కళాశాల’ హోదా ఇవ్వనున్నట్లు కళాశాల అధ్యాపక బృందం తెలిపింది. కళాశాల స్టార్ కళాశాల ప్రోగ్రాంకు ఎంపికవడంపై ప్రిన్సిపాల్ డా.జి.రవీంద్రనాథ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.వై.సావిత్రి సంతోషం వ్యక్తం చేశారు.