Sri Venkateswara University: ఎస్వీయూ ప్రతిష్టకు భంగం కలిగించొద్దు
తిరుపతి సిటీ: విద్యారంగంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఎస్వీయూ ప్రతిష్టకు అవాస్తవిక కథనాలతో భంగం కలిగించవద్దని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుస్సేన్ కోరారు. ఆదివారం ఆయన ఎస్వీయూలో మీడియాతో మాట్లాడారు. ఓ దిన పత్రికలో ఎస్వీయూలో ‘ఉద్యోగాలకు గండం’ అనే కథనం ప్రచురితమైందన్నారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవమన్నారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో రేషనలైజేషన్ వల్ల విభాగాల విలీనం, తద్వారా పోస్టులకు గండం ఏర్పడుతుందన్న విధంగా ఆ వార్త కట్టుకథగా ఉందన్నారు.
విశ్వవిద్యాలయాల్లో రేషనలైజేషన్ ప్రక్రియ 2016–17లో ప్రారంభమైందని, గత ప్రభుత్వం జీఓ నంబర్ 30 ద్వారా ఎస్వీయూలో పోస్టులన్నీ రేషనలైజేషన్ ద్వారా తగ్గించి, 151 పోస్టులకు మాత్రమే పరిమితం చేసిన విషయాన్ని ఆయన ఆధారాలతో సహా ప్రస్తావించారు. 2017 జూలై 30న నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని దాచిపెట్టి అవాస్తవిక, నిరాధార ఆరోపణలతో కథనాలు రాయడం ఎస్వీయూ ప్రతిష్టకు భంగం కలిగించడమేనన్నారు. గత ప్రభుత్వం లీగల్ సమస్యలతో పోస్టులను భర్తీ చేయకుండా తీరని అన్యాయం చేసిందన్నారు.
గతంలోనే శాఖల వారీగా, పోస్టుల వారీగా రేషనలైజేషన్ చేసిన చట్టప్రకారం, ఈ ప్రభుత్వం వచ్చాక రకరకాల కసరత్తులు చేసి, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి, ఎస్వీయూలో 250 పైచిలుకు పోస్టుల భర్తీకి సన్నద్ధమవుతున్న సమయంలో ఒక పత్రికలో అవాస్తవ కథనం ప్రచురించడం విడ్డూరమన్నారు. రేషనలైజేషన్ అనేది ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో, విద్యాశాఖలో నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ఎస్వీయూలో మాత్రమే చేపట్టిన ప్రక్రియగా అభివర్ణించడం ఆందోళన కలిగించేలా చేశారన్నారు. ఎస్వీయూ పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ దిశగా అడుగులు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. ఎస్వీయూలో మాత్రమే రేషనలైజేషన్ పేరుతో జీవో 71 ద్వారా అన్యాయం చేస్తున్నారని చెప్పడం సమంజసం కాదన్నారు.