Admissions: మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు సన్నాహాలు
కొత్త మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా గాంధీ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి, ప్రొఫెసర్ సత్యనారాయణను నియమించింది. తరగతుల నిర్వహణకు అనువైన భవనాన్ని కూడా గుర్తించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మొదటి ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయనుంది. క్రమంగా సీట్ల సంఖ్యను పెంచనుంది. మెడికల్ కాలేజీ రాక, అడ్మిషన్ల ప్రక్రియ మొదలుతో మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
చదవండి: Medical Health Department: ఆన్‌లైన్‌లో అభ్యర్థుల ప్రొవిజనల్ వెరిఫికేషన్ జాబితా
మీర్‌ఖాన్‌పేటలో శంకుస్థాపన
సామాన్యులకు సైతం వైద్య విద్యను అందించాలనే ఆలోచనలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున మంజూరు చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్ ఖాన్‌పేట సర్వే నంబర్ 112లో ఈ కొత్త మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు టీఎస్‌ఐఐసీ 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ మెడికల్ కాలేజీకి కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు రూ.160 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం సహా 400 పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటమి పాలై.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలిసిందే.
ప్రైవేటు భవనం కోసం అన్వేషణ
మరికొద్ది నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో 2024–25 విద్యా సంవత్సరంలో 50 ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసి, విద్యార్థులకు తరగతులు బోధించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు అక్కడ భవనం పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
కొత్త భవనం నిర్మించి, అందుబాటులోకి వచ్చే వరకు తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ /ప్రైవేటు భవనంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కందుకూరు, తుక్కుగూడ, మహేశ్వరం మధ్యలో అనువైన భవనాన్ని గుర్తించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సూచించినట్లు తెలిసింది.
మహేశ్వరంలో పర్యటించిన బృందం
మెడికల్ కాలేజీ ఏర్పాట్ల పరిశీలన కోసం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టర్ విమలా థామస్, మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సత్యనారాయణ, నిజామాబాద్ ప్రభుత్వ వైద్యశాల విభాగాధిపతి డాక్టర్ కేజే కిషోర్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా నియమించింది.
ఈ మేరకు జనవరి 12న ఈ వైద్య బృందం మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రతిపాదిత ప్రదేశంతో పాటు మహేశ్వరం, షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా సందర్శించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకత, వాటి పరిధిలోకి వచ్చే ఆరోగ్య కేంద్రాలు, చికిత్సల కోసం వస్తున్న రోగుల వివరాలపై ఆరా తీసిన వైద్య బృందం ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది.