సీఏఎస్ పోస్టుల అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ ఇదే
ఈ పోస్టుల భర్తీకి జూలై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులతో ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 13 సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. అభ్యంతరాలను casrecruitmentdphfw22@gmail.comకు మెయిల్ ద్వారా పంపాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. అభ్యంతరాలతోపాటు సంబంధిత అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలను తెలియజేయాలని కోరారు. గడువు అనంతరం అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. ప్రాథమిక మెరిట్ జాబితాపై అందిన అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. దీన్ని http://hmfw.ap.gov.in లో అందుబాటులో ఉంచుతామన్నారు.
చదవండి: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ..
కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 40 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 823 సీఏఎస్ పోస్టుల భర్తీ కూడా చేపడుతోంది. మరోవైపు వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను అప్పటికప్పుడే భర్తీ చేయడానికి అత్యవసర అనుమతులను ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. దీంతో పదోన్నతులు, ఉద్యోగ విరమణ, ఉద్యోగుల హఠాన్మరణం, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ, ఇతర కారణాలతో ఏర్పడే ఖాళీల భర్తీకి ప్రతిసారి ఆర్థిక శాఖ అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండానే పోస్టుల భర్తీ చేపట్టడానికి వీలు లభించింది.
చదవండి: వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే తీసుకోండి: సీఎం జగన్