Draupadi Murmu: టీచరమ్మగా రాష్ట్రపతి
ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోష్టులు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు.
చదవండి: Collector Kumar Deepak: ‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్ సీరియస్
వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం.
రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు.