US Elections 2024: నేడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్.. గెలిచేదెవరు
అమెరికాకు 47వ ప్రెసిడెంట్ ఎవరన్నది రాత్రికల్లా తేలిపోయే అవకాశముంది.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(60 ఏళ్లు), రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78 ఏళ్లు) మధ్య పోటీ నెలకొంది. ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్షుడిగా గద్దెనెక్కుతారు. అదే సమయంలో కమలా హారిస్ గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారు.
2020లో పోలింగ్ 66 శాతమే
అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. అంటే కేవలం 66 శాతం ఓటింగ్ నమోదైంది.
అమెరికా జనాభా 34.6 కోట్లు
అర్హులైన ఓటర్లు 23.5 కోట్ల పై చిలుకు
నమోదైన ఓటర్లు 16,14,22,000
ఇప్పటికే ఓటేసింది 7.7 కోట్ల పై చిలుకు
తొలిసారి ఓటేస్తున్నది 1.9 కోట్ల పై చిలుకు
Indian Companies: 15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం ఇదే..
ప్రచార నినాదాలు
హారిస్..
- అమెరికన్ల స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ
- రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులకు రక్షణ
ట్రంప్..
- దేశ ఆర్థిక పునర్నిర్మాణం
- అక్రమ వలసలకు పూర్తి అడ్డుకట్ట
పోలింగ్ వేళలు
- స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 5వ తేదీ(మంగళవారం) ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా.
- (భారత కాలమానం ప్రకారం రాష్ట్రాలవారీగా మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్ మొదలవుతుంది. బుధవారం ఉదయం దాకా కొనసాగుతుంది).
అసలు ఎన్నిక డిసెంబర్ 16న!
విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లే
అమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకునేది ఆ దేశ ఓట ర్లు కాదు. ఎలక్టోరల్ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు మంగళవారం నేరుగా ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్ ముగిశాక నెల పాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు.