Skip to main content

Jobs: ఈ ఉద్యోగాలు భర్తీలో బెస్ట్‌

సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇటీవల తొలగించాయి.
Jobs
ఈ ఉద్యోగాలు భర్తీలో బెస్ట్‌

మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్కీలు భయంభయంగా కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నాన్‌–టెక్‌ రంగాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన దేశంలో కరోనా కష్టకాలం అనంతరం నాన్‌–టెక్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏకంగా 30శాతానికి పైగా ఉద్యోగాలు పెరిగినట్లు ప్రముఖ గ్లోబల్‌ జాబ్‌సైట్‌ ఇండీడ్‌ ఇటీవల తెలిపింది. నిర్మాణ, ఆర్కిటెక్చర్, ఇతర నాన్‌ టెక్‌ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021, 2022 సంవత్సరాల్లో డిసెంబర్‌ నెలల్లో వెలువడిన ఉద్యోగ ప్రకటనలపై ‘ఇండీడ్‌’ నిర్వహించిన అధ్యయనంలో 2021తో పోలిస్తే 2022లో నాన్‌–టెక్‌ రంగాల్లో ఉద్యోగాల భర్తీ పెరిగినట్లు తేలింది. ఈ మేరకు ‘ఇండీడ్‌’ సంస్థ తమ అధ్యయనంలో గుర్తించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

‘ఇండీడ్‌’ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు 

jobs
  • ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి 30.8 శాతంపెరుగుదల నమోదైంది. డెంటిస్ట్, నర్సింగ్‌ సిబ్బంది, ఇతర ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. 
  • అనంతరం ఆహార సేవల రంగంలో 8.8 శాతం, నిర్మాణ రంగంలో 8.3 శా­తం, ఆర్కిటెక్చర్‌ 7.2, విద్యా రంగంలో 7.1, మార్కెటింగ్‌ రంగంలో 6.1 శాతం చొప్పున వృద్ధి నమోదైంది.
  • కరోనా కాలంలో నిర్మాణ, మార్కెటింగ్‌ వంటి రంగాల్లో కార్యకలాపాలు మందగించి ఉద్యోగులను తొలగించారు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గిన అనంతరం నిర్మాణ, మార్కెటింగ్‌ రంగాల్లో మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. 
  • నాన్‌–టెక్‌ రంగాల్లో నియామకాల్లో బెంగళూరు నగరం 16.5 శాతం వాటాతో అగ్రస్థానం­లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో  ముంబై (8.23 శాతం), పూణే (6.33 శాతం), చెన్నై (6.1శాతం) ఉన్నాయి. అహ్మదాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, మొహాలీ వంటి టైర్‌–2 నగరాలు 6.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
Published date : 09 Feb 2023 03:06PM

Photo Stories