Sports Reservation: ‘డిగ్రీ’లో క్రీడా రిజర్వేషన్ ఎక్కడ?
దీనివల్ల ఏటా 9 వేల మంది క్రీడాకారులు నష్టపోతున్నారని క్రీడారంగ నిపుణులు చెపుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4.68 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఉన్నత విద్యామండలి అమలు చేస్తున్న ‘దోస్త్’ప్రవేశాల విధానంలో మాత్రం క్రీడాకారులకు కనీసం ఒక్క సీటూ కేటాయించలేదు. అసలు ఆ కాలమే ఎత్తివేయడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Alumni: ప్రభుత్వ కళాశాలలో పనికొచ్చే పనిచేద్దాం..
నిర్లక్ష్యమేనా..?
దోస్త్‌లో దివ్యాంగులు, ఎన్‌సీసీ నేపథ్యం ఉన్న వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలూ నిర్వహిస్తున్నారు. అయితే క్రీడాకారుల విషయానికొచ్చే సరికి మాత్రం ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడం వల్లే దోస్త్‌లో స్పోర్ట్స్ కోటా పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, క్రీడారంగ విద్యార్థులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడాకారుల అసోసియేషన్లు కూడా ఉన్నత విద్యామండలికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాయని, అయినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. అన్నివిభాగాలతో పాటు క్రీడాకారులకూ 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా జీవో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఉన్నత విద్యామండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని చెబుతున్నారు.
చదవండి: Free Soft Skills Courses: ‘సాఫ్ట్ స్కిల్స్’లో మనమే మేటి
న్యాయం జరిగేనా..?
డిగ్రీ కోర్సుల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏటా తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి సీఎం కార్యాలయం సమాచారం సేకరిస్తోంది.
డిగ్రీలో క్రీడాకారుల కోటా అమలుకు జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అధికారుల వాదన మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. త్వరలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.