Skip to main content

ఏయూతో కలిసి పనిచేస్తాం

ఆంధ్రా విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తామని టోగో ఉన్నత విద్య, పరిశోధన శాఖ మంత్రి డాక్టర్‌ వటేబా తెలిపారు.
We will work together with AU
ఏయూతో కలిసి పనిచేస్తాం

అక్టోబర్‌ 6న ఆయన విశాఖపట్నంలోని ఏయూ ఫార్మసీ కళాశాల, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. టోగో విశ్వవిద్యాలయాలు ఏయూతో అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం వటేబా మీడియాతో మాట్లాడుతూ భారతదేశంతో తమకు బలమైన అనుబంధం ఉందన్నారు. భారత్‌ మంచి స్నేహపూర్వక దేశమని కొనియాడారు. ఏయూతో సైన్స్, ఇంజనీరింగ్, స్పేస్‌ సైన్స్, అగ్రికల్చర్‌ తదితర రంగాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతున్న పర్యావరణ, ఇంధన, ఆరోగ్య, వ్యవసాయ సంబంధిత అంశాలపై రెండు దేశాల విశ్వవిద్యాలయాలు సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. భారత్‌కు చెందిన వేలాది పరిశ్రమలు టోగోలో పనిచేస్తున్నాయన్నారు. భారత్‌లో 15 మంది టోగో విద్యార్థులు ఉన్నారని.. వీరిలో నలుగురు ఏయూలోనే ఉన్నారని చెప్పారు. ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ మెషీన్‌ లెర్నింగ్, ఐవోటీ, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు. విద్యార్థులతోపాటు అధ్యాపకుల ఎక్సే్ఛంజ్‌ చేసుకోవాలని వటేబా కోరారన్నారు. వైద్య రంగంలో నిపుణుడైన డాక్టర్‌ వటేబాను ఏయూ హ్యూమన్‌ జెనెటిక్స్‌ విభాగంలో గౌరవ ఆచార్యుడిగా నియమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వటేబాను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. 

Published date : 08 Oct 2022 05:10PM

Photo Stories