Duddilla Sridharbabu: విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యం
జిల్లాకేంద్రంలో మంత్రి శ్రీధర్‌బాబు అక్టోబర్ 25న వివిధ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రూ.9.48 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత బాలుర, బాలికల అధునాతన సాంకేతిక కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో బాలికల కళాశాలను ఏటీసీగా మార్చామని, త్వరలో బాలుర కళాశాలను కూడా ఏటీసీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టాస్క్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో జిల్లాకేంద్రంలో టాస్క్ సెంటర్‌ను ప్రారంభించుకుంటామన్నారు.
చదవండి: AAPAR Card : అపార్ యూనిక్ ఐడీల జారీకి పటిష్ట చర్యలు
రానున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక విభాగాన్ని జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు అనుగుణంగా సాంకేతికపరమైన ఇంకూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఇక్కడి ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
జిల్లాకు సువర్ణ అధ్యాయం ప్రారంభం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జిల్లాకు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైందన్నారు. జిల్లాలో మొట్టమొదటిగా ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఐటీఐ చేసే విద్యార్థులకు మంచి రోజులు రానున్నాయని తెలిపారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు నేషనల్ హైవే ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో డ్రైపోర్టు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్‌నగర్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలో కృష్ణా, మాగనూర్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరితే సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వరంగంలో ఒక బాలుర, ఒక బాలికల ఐటీఐ కళాశాలలు ఉన్నాయని అన్నారు. బాలికల ఐటీసీలో 172 మంది బాలికలకు అడ్మిషన్లకు అవకాశం ఉందని, ఇప్పటివరకు 100 మంది అడ్మిషన్లు పూర్తయ్యాయని, ఆసక్తి గల బాలికలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.