Technology Park: ఏయూలో టెక్నాలజీ పార్క్
ఇందుకోసం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ)తో ఏయూ ఒప్పందం చేసుకుంది. వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి సమక్షంలో జూలై 6న ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ఎస్టీపీఐ ఏపీ, తెలంగాణ డైరెక్టర్ రామ్‌ప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.60 కోట్లతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్టార్టప్‌లు విజయవంతంగా మొదలైనా.. సహకారం, ప్రోత్సాహం లేకపోవడం వల్ల.. నిలదొక్కుకున్న వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. దీనిని అధిగమించేందుకు.. స్టార్టప్‌లతో ముందుకొస్తున్న యువతను ప్రోత్సహించాలని ఏయూ నిర్ణయించింది.
ఎస్టీపీఐ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్‌కు పంపించగా.. ఆయన ఆమోదముద్ర వేశారు. ఉత్తరాంధ్ర యువతకు వరం లాంటి ఈ టెక్నాలజీ పార్క్‌ను మూడు దశల్లో రూ.60 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. మొదటిదశ పనులను రూ.19.5 కోట్లతో పూర్తి చేయనున్నారు.
చదవండి: Design Thinking: ఏయూలో డిజైన్ థింకింగ్‌పై సదస్సు
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అడుగులు
మూడు, నాలుగు వారాల్లో టెక్నాలజీ పార్క్‌కు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయనున్నాం. కొత్త స్టార్టప్‌లతో పాటు.. అభివృద్ధి చెందిన వాటిని కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు అడుగులు వేస్తున్నాం. ఏయూలో ఇప్పటికే 102 స్టార్టప్ కంపెనీలు నడుస్తున్నాయి. ఫెయిల్ అయిన స్టార్టప్‌లకు ఏ హబ్ కూడా స్థానాన్ని కల్పించదు. కానీ.. మేము వారిని కూడా ప్రోత్సహిస్తూ.. సరికొత్త మార్గంలోకి ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఏయూ వైస్ చాన్స్‌లర్
ఏపీలో విజయవంతంగా విస్తరణ
ఏయూతో ఒప్పందం వల్ల ఏపీలో విజయవంతంగా విస్తరించే అవకాశం లభించింది. విద్యార్థులు, యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా జీవితాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వనరులను ఏయూ సహకారంతో టెక్నాలజీ పార్క్‌లో ఏర్పాటు చేస్తాం. స్టార్టప్‌లు విజయవంతమైన పారిశ్రామిక సంస్థలుగా ఎదిగే క్రమంలో అనేక దశలు దాటాల్సి ఉంటుంది. ప్రతి దశలో అనేక అవరోధాలు అధిగమించాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ తోడ్పాటునందిస్తాం.
– సీవీడీ రామ్‌ప్రసాద్, ఎస్టీపీఐ ఏపీ, తెలంగాణ డైరెక్టర్