Skip to main content

UGC Chairman Interview: తెలుగు రాష్ట్రాల్లో.. విద్యపై ప్రత్యేక దృష్టి

ఉన్నత విద్యారంగం, యూనివర్సిటీల్లో నాణ్యత ప్రమాణాల పెంపే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగుతానని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ పేర్కొన్నారు.
jagdish kumar
యూజీసీ నూతన చైర్మన్ ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌

యూనివర్సిటీల్లో సరైన ప్రమాణాలు లేకపోతే ఆ తరమే నష్టపోతుందని, ఆ నష్టం వాటిల్లకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ జగదీశ్‌కుమార్‌ యూజీసీ చైర్మన్ గా ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. యూనివర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తానన్నారు. రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు వేగవంతమయ్యేలా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ మంత్రులు, వైస్‌ చాన్సలర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అనుమతిలేని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా వచ్చే ఏడాది హయ్యర్‌ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా (హెకీ)ను అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతున్నట్లు తెలిపారు. దీన్లో నాలుగు విభాగాలుంటాయన్నారు. యూజీసీ రెగ్యులేటరీ వ్యవహారాలు, నిధులు, అసెస్‌మెంట్స్‌–గ్రేడింగ్, నాణ్యత ప్రమాణాల పెంపు వంటి కార్యకలాపాలను ఈ విభాగాలు చూస్తాయని వివరించారు. యూనివర్సిటీలు దూరవిద్య కేంద్రాలకు విధించిన భౌగోళిక పరిధిని దాటడానికి వీల్లేదన్న అంశంపై చర్యలు చేపడతామన్నారు.

తెలుగువారి అభినందనలు శక్తినిస్తున్నాయి

యూజీసీ చైర్మన్ గా నియామకంతో తెలుగు ప్రజల నుంచి అందుతున్న అభినందనలు ఎంతో శక్తినిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వైస్‌ చాన్సలర్లు, విద్యాశాఖ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. యూనివర్సిటీల్లో సమస్యలు.. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, యూజీసీ నుంచి ఎలాంటి సహకారం అవసరం అన్న అంశాలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

చదవండి: 

UGC: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన‌ తెలంగాణ వ్యక్తి?

UGC Surveillance: కాపీ కొడితే..పరిశోధన హుళక్కే

Exam Info: సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌... సైన్స్‌ విభాగాల్లో పరిశోధనలు, బోధనకు మార్గం

Published date : 05 Feb 2022 02:13PM

Photo Stories