Skip to main content

Exam Info: సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌... సైన్స్‌ విభాగాల్లో పరిశోధనలు, బోధనకు మార్గం

How to Prepare for CSIR NET Exam: Examination Procedure, Preparation‌ Guidance‌
How to Prepare for CSIR NET Exam: Examination Procedure, Preparation‌ Guidance‌

సైన్స్‌ విభాగాల్లో బోధన, పరిశోధనలకు అవకాశం కల్పించే.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)జూన్‌2021కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. జూలై 2021లో జరగాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ జూన్‌ 2021కు కొత్త షెడ్యూల్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

  • సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ జూన్‌ 2021కు నోటిఫికేషన్‌ విడుదల
  • జనవరి 29, ఫిబ్రవరి 5, 6 తేదీల్లో పరీక్ష నిర్వహణ 
  • ఈ పరీక్షలో అర్హతతో సైన్స్‌ విభాగాల్లో పరిశోధనలు, బోధనకు మార్గం

దేశంలో బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, బేసిక్‌ సైన్స్‌ రంగాల్లో అభివృద్ధి, పరిశోధనలపై నిరంతరం కృషి చేస్తున్న సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌). సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మానవ వనరులను తీర్చిదిద్దుతున్న సంస్థ ఇది. ఇందుకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)తో కలిసి ఏటా రెండుసార్లు సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు సైన్స్‌లో బోధనకు, పరిశోధనలకు అవకాశం కల్పిస్తోంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే.. సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రీసెర్చ్‌ సెంటర్లలో, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే.. యూనివర్సిటీలు లేదా డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయచ్చు.

చ‌ద‌వండి: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో...

అయిదు సబ్జెక్టులు

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షను ఎన్‌టీఏ సైన్స్‌ విభాగానికి చెందిన అయిదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తోంది. అవి.. కెమికల్‌ సైన్సెస్, లైఫ్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌; ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌.

అర్హతలు

  • కనీసం 55శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌–ఎంఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌  తదితర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
  • వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించడానికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/మహిళ విద్యార్థులకు 5ఏళ్లు, నాన్‌క్రిమిలేయర్‌ ఓబీసీలకు మూడేళ్లు  గరిష్ట వయోసడలింపు లభిస్తుంది.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/లెక్చరర్‌షిప్‌ కు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

స్టయిపండ్‌

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షలో ప్రతిభ చూపి.. జేఆర్‌ఎఫ్‌కి ఎంపికైతే.. మొదటి రెండేళ్లు ప్రతి నెల రూ.31 వేలు చొప్పున స్టయిపండ్‌ ఇస్తారు. అలాగే ప్రతి ఏడాది రూ.20 వేలు చొప్పున అభ్యర్థి పరిశోధన చేసే సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కంటింజెంట్‌ గ్రాంటుగా పొందవచ్చు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే ప్రతి నెల రూ.35వేల చొప్పున స్టయిపండ్‌ లభిస్తుంది.

చ‌ద‌వండి: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌సెన్సైస్ కోర్సులు

పరీక్ష విధానం

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌(ఎంసీక్యూ) పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు పార్ట్‌ ఏ, పార్ట్‌ బీ, పార్ట్‌ సీ ఉంటాయి. 

పార్ట్‌ ఏ
ఇది అందరికి ఒకే విధంగా ఉంటుంది. జనరల్‌ అప్టిట్యూడ్‌పై గరిష్టంగా 20 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 30 మార్కులు లభిస్తాయి. ఇందులో లాజికల్‌ రీజనింగ్, గ్రాఫికల్‌ అనాలిస్, అనలిటికల్‌–న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, సిరీస్‌ ఫార్మేషన్, పజిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు.

పార్ట్‌ బీ
ఇందులో సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో ఆయా సబ్జెక్టును అనుసరించి 25–50 ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. వీటిలో ఏవైనా 25 నుంచి 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వీటికి గరిష్టంగా 75–100 మార్కులను కేటాయించారు. బేసిక్‌ కాన్సెప్ట్స్, డిగ్రీ, పీజీ స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ డిగ్రీ, పీజీ స్థాయి సిలబస్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. 

పార్ట్‌–సి
ఇందులో సైంటిఫిక్‌ కాన్సెప్ట్‌లపై అభ్యర్థులకు ఉన్న అవగాహన, పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఆయా సబ్జెక్టును అనుసరించి 30 –80 వరకు ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 25 నుంచి 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. మొత్తం 200 మార్కుల పరీక్షలో ఒక్క పార్ట్‌ సీకే 100 మార్కులు కేటాయించారు. అధిక వెయిటేజీ ఉన్న విభాగం ఇది. కాబట్టి అభ్యర్థులు ఇందులో రాణించేందుకు ప్రామాణిక పుస్తకాలు చదవాలి.

నెగిటివ్‌ మార్కులు

ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కుల విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

సబ్జెక్టుల వారీగా సిలబస్‌
కెమికల్‌ సైన్సెస్‌

  • ఆర్గానిక్‌ కెమిస్ట్రీ: రియాక్టన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎస్‌మెట్రిక్‌ సింథసిస్, కన్ఫర్‌మేషనల్‌ అనాలిసిస్,ఆర్గానిక్‌ స్పైక్ట్రోస్కోపి,రియోజెంట్స్, పెరిసైక్లిక్‌ చర్యలు తదితర అంశాలు చదవాలి.
  • ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ: సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్, కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మోడల్‌ క్లస్టర్స్‌ తదితర అంశాలపై∙దృష్టిసారించాలి.
  • ఫిజికల్‌ కెమిస్ట్రీ: క్వాంటమ్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌ స్టేట్, మాలిక్యులర్‌ స్పైక్ట్రోస్కోపి, స్టాటిస్టికల్‌ థర్మోడైనమిక్స్, కెమికల్‌ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ తదితర అంశాలను చదవాలి. 

లైఫ్‌ సైన్సెస్‌

లైఫ్‌ సైన్స్‌ విభాగంలో ఈ పరీక్ష రాసే వారు ఆధునిక బయాలజీ(మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్, బయోఫిజిక్స్‌) దృష్టి సారించాలి. క్లాసికల్‌ బయాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఎకాలజీ, ఎవల్యూషన్, బయోడైవర్సిటీనీ చదవాలి.

ఫిజికల్‌ సైన్సెస్‌

మోడరన్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ అండ్‌ పార్టికల్‌ ఫిజిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, (క్లాసికల్‌–స్టాటిస్టికల్‌), ఎలక్ట్రోమాగ్నటిక్‌ థియరీ, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెథడ్స్, ఆప్టిక్స్, మెకానిక్స్‌ సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.

మ్యాథమెటికల్‌ సైన్సెస్‌

స్టాటిస్టిక్స్, ఎక్స్‌పోలేటరీ డేటా అనాలిసిస్, కాంప్లెక్స్‌ డిఫరెన్షియల్‌ అనాలిసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలను ప్రధానంగా చదవాలి. 

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.01.2022
  • పరీక్ష తేదీలు: 2022 జనవరి 29, ఫిబ్రవరి 5, 6. 
  • వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in

చ‌ద‌వండి: Life Sciences

Published date : 06 Dec 2021 06:24PM

Photo Stories