UGC Surveillance: కాపీ కొడితే..పరిశోధన హుళక్కే
పరిశోధనల్లో విషయ చౌర్యంపై యూజీసీ నిఘా.. ఆధునిక సాంకేతికతో ప్రత్యేక ఏర్పాట్లు
- పరిశోధనల్లో నైతికత, నాణ్యత పెంచేలా చర్యలు
- కాపీ చేస్తే పరిశోధకుడితోపాటు మార్గనిర్దేశం చేసే ప్రొఫెసర్లపైనా చర్యలు
- రెండేళ్లలో పెరిగిన విషయ చౌర్యం
యూనివర్సిటీలు, వివిధ ఉన్నత విద్యాసంస్థల్లో కొనసాతున్న పరిశోధనల్లో నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా పరిశోధనా పత్రాల్లో విషయ చౌర్యం ఎక్కువగా జరుగుతున్నట్లు గమనించిన యూజీసీ వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. కరోనా సమయంలో ఈ చౌర్యం మరింత ఎక్కువైనట్లు గుర్తించింది. పరిశోధనల్లో కాపీరాయుళ్లను నిరోధించడానికి నాలుగేళ్ల క్రితమే మార్గదర్శకాలిచ్చినా చౌర్యం యథాతథంగా కొనసాగుతుండటంతో తాజాగా ‘అకడమిక్ ఇంటెగ్రిటీ అండ్ రీసెర్చి క్వాలిటీ’ కోసం కొత్త విధివిధానాలు జారీ చేసింది. పరిశోధనల్లో అనైతిక ప్రవర్తన, అవాంఛనీయ పద్ధతుల కారణంగా సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుందని యూజీసీ అభిప్రాయపడింది. ముఖ్యంగా శాస్త్రీయతపై ప్రజల్లో విశ్వాసాన్ని నష్టపరుస్తుందని పేర్కొంది. ఇందుకోసం ఆయా విభాగాలను మరింత పటిష్టం చేసి పరిశోధనా నిర్వహణ, వాటి అవుట్ పుట్‌ను పరస్పరం పంచుకునేలా ఏర్పాట్లు చేసింది. సాధారణ మార్గదర్శకాలతో పాటు కొన్ని నిర్దిష్ట కోడ్‌లను సైతం ఏర్పాటు చేసింది.
Also read: Smart Governance: ‘స్మార్ట్’గా ప్రపంచ పరిజ్ఞానం
ఎఫ్‌ఎఫ్‌పీ పెరిగిపోయింది
కరోనా సమయంలోను, తదనంతరం పరిశోధనలు సాగించే యువతలో తీవ్ర మానసిక సమస్యలు నెలకొంటున్నాయని, ఇది పరిశోధనలపై తీవ్ర ప్రభావమే చూపిస్తోందని యూజీసీ తేల్చింది. ఈ వాతావరణాన్ని మార్చాల్సిన అవసరముందని పేర్కొంది. కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు కూడా పరిశోధనా విద్యార్ధులు తమ పరిశోధనలను అర్థంతరంగా నిలిపివేయడం లేదా అసంపూర్తిగా ముగించేసి పట్టా పొందితే చాలన్న భావన కూడా ఈ అనైతిక ప్రవర్తనకు కారణమవుతోందని వివరించింది. ఫ్యాబ్రికేషన్ (తారుమారు), ఫాల్సిఫికేషన్ (తప్పుడు ప్రచారం), ప్లాగిరిజమ్ (కాపీకొట్టడం) అనే మూడు రకాల పెడధోరణులు ఇప్పుడు పరిశోధనల్లో పెరిగాయని యూజీసీ పేర్కొంది.
Jobs: నిరుద్యోగులకు శుభవార్త..10000 ఉద్యోగాలకు మెగా జాబ్‌మేళా.. త్వరగా రిజిస్టర్ చేసుకోండిలా..
యూజీసీ కేర్ ఇలా..
నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ద్వారా ప్రతి ఉన్నత విద్యాసంస్థలో ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను తప్పనిసరి చేస్తూ యూజీసీ ఆదేశాలిచ్చింది. ఇవి ఆ సంస్థల్లోని పరిశోధనల్లో నాణ్యతకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోపక్క పరిశోధనా నాణ్యతలను పెంచడానికి అన్ని యూనివర్సిటీల్లో కన్సార్టియమ్ ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చి ఎథిక్స్ (కేర్)ను తప్పనిసరి చేసింది. పరిశోధనల్లో నాణ్యతను, సమగ్రతను, నైతికతను ప్రోత్సహించేందుకు, గ్లోబల్ ర్యాంకులను సాధించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేసింది. విషయ చౌర్యానికి తావులేకుండా నాణ్యమైన జర్నల్స్‌ను గుర్తించి తద్వారా ఈ ర్యాంకులను సాధించేలా చేయనుంది. సందేహాస్పదమైన, లేదా సరైన ప్రమాణాలతో లేని జర్నల్స్‌ను గుర్తించి నిరోధించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విషయ చౌర్యంతో పాటు ఆయా జర్నల్స్ లేదా పరిశోధనల్లోని డొల్లతనాలను సులభంగా గుర్తించి అడ్డుకట్ట వేయనుంది. రిఫరెన్స్ లిస్ట్ ఆఫ్ క్వాలిటీ జర్నల్స్‌ను యూజీసీ కేర్ సిద్ధం చేసింది. ప్రతి మూడునెలలకు ఒకసారి దీనిని నవీకరించడం ద్వారా పరిశోధనల్లో విషయ చౌర్యాన్ని, తారుమారు వంటి అంశాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
విషయ చౌర్యం చేస్తే చర్యలు
ప్రమాణాలు కొరవడిన పరిశోధనలు, విషయాన్ని చోరీ చేసి సమర్పించే పరిశోధనలపై చర్యలు తీసుకునేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇలాంటి వాటికి ఉన్నత విద్యాసంస్థలు పెనాల్టీలు విధించనున్నాయి. ఆయా పరిశోధన పత్రాలను వేర్వేరు కోణాల్లో పరిశీలించి ఈ చౌర్యాన్ని నిర్ధారించనున్నారు. 10 నుంచి 40 శాతం వరకు కాపీ చేసినట్లు ఉంటే కనుక ఆ పరిశోధనను 6 నెలల్లో తిరిగి రివైజ్ చేసి సమర్పించేలా చూస్తారు. 40 నుంచి 60 శాతం వరకు కాపీ కొట్టినట్లు తేలితే కనుక ఆతనికి ఎలాంటి క్రెడిట్లు ఇవ్వరు. ఏడాదిలో మళ్లీ ఆ పరిశోధనా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 60 శాతం కన్నా ఎక్కువ విషయాన్ని కాపీ కొట్టినట్లు తేలితే ఆతని రీసెర్చి రిజిసేŠట్రషన్‌ను రద్దు చేస్తారు. కొన్ని సందర్భాల్లో డిగ్రీ ప్రదానం చేశాక కాపీ కొట్టిన అంశాలు బహిర్గతమైతే ఆ డిగ్రీలను నిలుపుచేస్తారు. అంతేకాకుండా ఈ కాపీ పరిశోధనల విషయంలో మార్గదర్శనం చేసిన ఫ్యాకల్టీపై కూడా చర్యలు చేపడతారు. మూడేళ్ల వరకు గైడ్‌గా అవకాశం ఇవ్వరు.
Click here for more Education News