Teachers Day: నాన్నే.. మొదటి గురువు.. గురువులకు వందనం...
జ్యోతి మేడమ్ స్ఫూర్తితోనే ఈ స్థాయికి..
నేను పదకొండేళ్ల వయస్సు వరకు బాల కార్మికురాలిగా వివిధ రకాల పనులు చేశాను. చదువుకునే స్థోమత, ఆసక్తి రెండూ ఉండేవి కావు. కానీ భుక్తాపూర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేసిన జ్యోతి మేడం నా సమస్యను గుర్తించి నన్ను చదువుకునేలా ప్రోత్సహించింది. పాఠశాలలో చేర్పించడమే కాకుండా నాకు అన్ని విధాలుగా అండగా నిలిచి చదువు అవశ్యకతను తెలిపారు. ఆ మేడం ఇచ్చిన స్ఫూర్తితో చదువుపై దృష్టి పెట్టాను. ఇంటర్, డిగ్రీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చదివాను. ఓయూలో పీజీ పూర్తి చేశా. ప్రస్తుతం జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్‌గా, విద్యావంతురాలిగా ఎదిగానంటే అందుకు జ్యోతి మేడం అందించిన సహకారమే. ప్రస్తుతం హైదరాబాద్ బాలభవన్‌లో పనిచేస్తున్న ఆ టీచర్ చేసిన మేలు ఎన్నటికీ మరిచిపోలేను. ఆదర్శవంతులైన ఉపాధ్యాయుల మార్గదర్శనంలో ముందుకు సాగితే ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటారనేందుకు నేనే ఉదాహరణ.
– సయ్యద్ షెహజాది, జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్
జీవిత పాఠాలు నేర్పించారు
మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామం. అక్కడ 1నుంచి 5వ తరగతి వరకు చదివాను. 6, 7 తరగతులు మూడు కిలోమీటర్లున్న పక్క ఊరికి నడిచివెళ్లి చదివాను. ఆ తర్వాత 9, 10 తరగతులు సైకిల్‌పై వెళ్లేవాడిని. నాపై టీచర్ల ప్రభావం చాలా ఉండేది. వారంటే చాలా గౌరవం, మర్యాదగా మెలిగేవాళ్లం. 1 నుంచి 7వ తరగతి వరకు బోధించిన ఉపాధ్యాయులు శ్రీరాములు, నారాయణరెడ్డితో పాటు మా బాబాయి వెంకట్‌రెడ్డిలు ఏ విధంగా చదవాలి.. అందరితో ఎలా మెలగాలనే విషయాలను తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదవాలని అప్పట్లో నా గురువులు చెప్పేవారు. మాది వ్యవసాయ కుటుంబం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివాను. సందేహాలుంటే ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు అడిగి నివృత్తి చేసుకునేవాడిని. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం ఎంతో ఉంది. గురువులు విద్యార్థుల భవిష్యత్ గురించే ఆలోచిస్తారు. అది మరువద్దు.
– ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ
ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చా..
నేను ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజకీయాల్లోకి వచ్చాను. 1987లో బోథ్ మండలం మహదుగూడలో గిరిజనశాఖ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాను. వివిధ పాఠశాలల్లో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించా. ఈ క్రమంలో 2004లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వ చ్చి టీఆర్‌ఎస్‌లో చేరాను. బోథ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాను. 2019లో బీజేపీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఎంపీగా గెలిచాను.
– సోయం బాపూరావ్, ఎంపీ, ఆదిలాబాద్
23 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలోనే..
నేను ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజకీయాల్లోకి వచ్చాను. 1986లో ఆదిలాబాద్ మండలం చింతగూడ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాను. దాదాపు 23ఏళ్ల పాటు అదే వృత్తిలో కొనసాగాను. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆకర్షితుడినై 2009లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. కేసీఆర్ సమక్షంలో అప్పటి టీఆర్‌ఎస్(ప్రస్తుత బీఆర్‌ఎస్)లో చేరాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఉపాధ్యాయుడిగా ఉన్న క్రమశిక్షణ రాజకీయాల్లో ఉపయోగపడింది.
– రాథోడ్ బాపూరావ్, ఎమ్మెల్యే, బోథ్
ఉపాధ్యాయుడికి రెండోసారి ఉత్తమ అవార్డు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖ అధికారుల తీరు పై ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఒక ఉపాధ్యాయుడు ఒక హోదాలో ఒకేసారి మాత్రమే ఉత్తమ అవార్డు తీసుకోవాలి. హోదా మారితే తప్ప మరోసారి తీసుకోరాదు. 2020 కోవి డ్ సమయంలో జిల్లాలో 65మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అప్పట్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించలేదు. మండలస్థాయిలో ఎంఈవోలు, అధికారులు వెళ్లి ప్రశంసపత్రాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఆ ఏడాది డీఈవోగా రవీందర్‌రెడ్డి ఉన్నారు. బోథ్ ఆదర్శ మోడల్ స్కూల్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఉమేష్‌ను ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యా య అవార్డు అందజేశారు. అయితే ఈఏడాది సైతం ఆ ఉపాధ్యాయుడిని ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విషయాన్ని జిల్లా విద్యాశాఖా ధికారుల దృష్టికి తీసుకెళ్లినా, అప్పట్లో ఆయనకు అ వార్డు ఇవ్వలేదని తప్పు కప్పిపుచ్చే యత్నాలు చేస్తున్నారని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలెందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. మో డల్ స్కూల్ విభాగంలో ఇదివరకే అవార్డు పొందిన ఆ ఉపాధ్యాయుడికి బదులు మరో టీచర్‌కు అవార్డు ఇస్తే న్యాయంగా ఉంటుందని తెలిపారు.
గురువుల ప్రోత్సాహంతో..
ఆదిలాబాద్‌టౌన్: మాది నేరడిగొండ మండలంలోని చిన్నబుగ్గారం. గ్రామంలో, పార్డి (బి)ఆశ్రమ పాఠశాల, నిర్మల్‌లోని జుమెరాత్ పేటలోని హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. గురువు చందులాల్, రాజయ్య, వెంకట్‌రాంరెడ్డిలు నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఐటీడీఏలో ఉపాధ్యాయ ఉద్యోగంతో పాటు పోస్టల్ జాబ్ వచ్చింది. ఇందులో చేరినప్పటికీ సెలవు పెట్టా. ఆ తర్వాత ఎంసెట్ రాస్తే ఉస్మానియా ఆస్పత్రిలో సీటు వచ్చింది. ఆర్థిక పరిస్థితులతో వరంగల్ మెడికల్ కళాశాలకు మ్యూచువల్ టాన్స్‌ఫర్ పెట్టుకున్నా. బెల్లంపల్లిలోని సింగరేణి ఆస్పత్రిలో వైద్యుడిగా చేరా. తర్వాత సారంగాపూర్ రెగ్యులర్ వైద్యుడిగా, నిర్మల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా పనిచేశాను. పీజీ అర్థోపెడిక్ సీటు వచ్చింది. వరంగల్‌లో అసిస్టెంట్, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్‌గా, నల్గొండ జిల్లాలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి అక్కడినుంచి రిమ్స్ డైరెక్టర్‌గా ఆదిలాబాద్‌లో పనిచేస్తున్నా.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్
టిశాట్‌లో సతీశ్ పాఠాలు
బోథ్: మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న భైరి సతీశ్‌కుమార్ టిశాట్‌లో రెండేళ్లుగా గణితం పాఠాలు బోధిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలో డీడీ యాదగిరి చానల్‌లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. కృత్యపత్రాల తయారీలో భైరి సతీష్‌కు చోటు లభించింది.రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మెంటర్‌గా అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టీచర్స్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ అవార్డులో దేశంలో టాప్ 5లో చోటు లభించింది. తెలంగాణ నుంచి కేవలం సతీశ్ ఎంపికయ్యారు.
మా నాన్నే నాకు స్ఫూర్తి
ఆదిలాబాద్‌టౌన్: మాది జగిత్యాల. మా నాన్న పుప్పాల రామచంద్రం గణితం, సైన్స్ బోధించేవారు. హెచ్‌ఎంగా విధులు నిర్వహించారు. నాన్న ఉపాధ్యాయులు కావడంతో బదిలీ అయినప్పుడు పలు చోట్ల విద్యాభ్యాసం చేశాను. గురువులు నర్సింహారెడ్డి, శంకర్ ప్రోత్సహించేవారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో పాలిటెక్నిక్ చదివాను. లెక్చరర్ ని రంజన్‌రావు పలు అంశాలను వివరించేవారు.
– పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్
ఉపాధ్యాయుడిగా పనిచేసి..
బోథ్: మాజీ ఎంపీ గొడం నగేశ్ ఏడేళ్లు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. మొదటి సారిగి 1986లో బజార్‌హత్నూర్ మండలం విఠల్‌గూడ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. తర్వాత బోథ్ మండలం పార్డి(బి) ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎంగా, బజార్‌హత్నూర్ మండలం తన స్వంత గ్రామమైన జాతర్ల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌పై పదోన్నతిపై బదిలీ అయ్యారు. తండ్రి రామారావు ఎమ్మెల్యేగా ఉండటంతో రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఎంపీగా గెలిచారు.
నేలపై పటాలు వేసి..
సోన్: కడం మండలం లింగాపూర్‌కు చెందిన కుర్ర శేఖర్. జెడ్పీఎస్‌ఎస్ న్యూ వెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు. నేల పై గ్లోబు, ఇండియా, తెలంగాణ, అన్ని ఖండాలు, పర్వతాల పటాలు వివిద ఆకృతిలో వేసి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంలో ఆయనే సాటి. ఆయన కృషిని గుర్తించిన అధికారులు సత్కరించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, విద్యా సేవ రత్న అవార్డులు దక్కాయి
చార్ట్‌లతో బోధన
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు మనోహర్‌రెడ్డి నర్సాపూర్(జి) ఉన్నత పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తున్నారు. కోవిడ్ వల్ల విద్యార్థుల్లో ఆలోచన ధోరణి పెంపొందించేలా కత్యాధార పద్ధతుల ద్వారా గణితాన్ని బోధించారు. గుణింతాలు, బీజగణితం, ఆల్జీబ్రా తదితర అంశాలను చార్ట్‌లు, మాడ్యూల్స్ ద్వారా వివరించారు. గణితంలో ఈయన చేసిన పరిశోధనలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు.
గుర్తింపు లభించింది
కుంటాల: మండలంలోని పెంచికల్ పాడ్ ప్రాథమిక పాఠశాలలో గుణాత్మకమైన విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, కాలుష్య నివారణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోనే ది బెస్ట్ ప్రైమరీ స్కూల్ గా గుర్తింపు లభించింది. ఇటీవల పాఠశాల సక్సెస్ స్టోరీని ఎస్‌సీఈఆర్టీ తెలంగాణ ప్రచురించిన ఇన్ ఫ్లూయెన్స్, ఇన్పిరేషన్ పుస్తకంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐసీటీ ద్వారా స్మార్ట్ డిజిటల్ పాఠశాలగా రూపుదిద్దుకుంది.
- మ్యాదరి ఎల్లన్న, హెచ్‌ఎం, పెంచికల్‌పాడ్
నాన్నే.. మొదటి గురువు
మా నాన్న సాయి ప్రసాద్‌రావు నా తొలి గురువు. నాలుగో తరగతి చదివేటప్పుడు ఓ సారి గణితంలో నాకు రెండు మార్కులే వచ్చాయి. అప్పటినుంచి ఆయన నాపై ప్రత్యేక శ్రద్ధ వహించా రు. మ్యాథ్స్‌లో రాణించేలా తీర్చిదిద్దారు. ఆయన మార్గదర్శకంలో చదివిన నేను పదో తరగతిలో వందకు 98 మార్కులు, ఇంటర్‌లో 300కు 300 మార్కులు సాధించగలిగా. పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ కూకట్‌పల్లి నారాయణ జూనియర్ కళాశాలలో చదివా. హైస్కూల్ దశలో ఇంగ్లీష్ టీచర్ విలాసిని, సోషల్ టీచర్ అంస్టా నన్ను ఎక్కువగా ప్రోత్సహించేవారు. సామాజికంగా ఎలా మెలగాలి.. ఏ విధంగా సాగితే ఉన్నతంగా ఎదుగుతారనే విలువలు నేర్పించి నా కెరీర్‌కు తోడ్పాటు అందించారు. వారి మార్గదర్శకమే నేను ఐఏఎస్ సాధించేందుకు దోహదపడింది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. విద్యార్థులు గురువులు చెప్పే విషయాలను పాటిస్తూ వారి సూచనలకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు.
– రాహుల్‌రాజ్, కలెక్టర్
ఉత్తమ విద్య ‘గురుకులం’
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లో ఉపాధ్యాయులు ఉత్తమ విద్య అందిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యబోధన చేశారు. గురుకులంలో 8 మంది బోధన సిబ్బంది ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. గతేడాది గణిత ఉపాధ్యాయుడు ప్రమోద్‌కుమార్ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు రాష్ట్రస్థాయిలో 2 సార్లు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్నారు.
విద్యార్థులకు సేవ చేయడమే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: చదువుకునే సమయంలో తాను పడిన కష్టం మరొకరు పడొద్దనే భావనతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు రిటైర్డు హెచ్‌ఎం పరిశ పుల్లయ్య. తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన ఆయన తాను చదువుకునే రోజుల్లో అష్టకష్టాల నడుమ విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగంలో స్థిరపడ్డాడు. నాటి నుంచి అవసరమైన వారికి తోచినంత సాయం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశాక కూడా తన సతీమణి పరిశ సీతారత్నం పేరిటట పీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాల్లో కొనసాగిస్తున్నారు. 1980 మార్చి 28వ తేదీన నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో ఎస్‌జీటీగా విధుల్లో చేరిన పుల్లయ్య 2017 ఫిబ్రవరి 28న ముదిగొండ మండలం బాణాపురం హెచ్‌ఎంగా ఉద్యోగ విరమణ పొందారు. విధుల్లో ఉన్న కాలంలో విద్యార్థులకు అవసరమైన పలు రకాల సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. అనంతరం 2022వ సంవత్సరంలో ట్రస్ట్ ఏర్పాటుచేయగా, 2022–23వ సంవత్సరంలో 12మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.1.25లక్షలు, 10మంది వైద్య విద్యార్థులకు రూ.1.60లక్షలు, బీ ఫార్మసీ విద్యార్థినికి రూ.20వేలు, అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థినికి రూ.17వేలు, ఐఐఐటీ విద్యార్థులు ముగ్గురికి రూ.15వేలు అందజేశారు. అలాగే, విద్యాసంస్థల్లో అవసరాలకు రూ.1,34,563 సమకూర్చారు.
ఉచిత శిక్షణ కార్యక్రమాలు
ధర్మపురి: ధర్మపురికి చెందిన కాశెట్టి రమేశ్ దోనూర్ ఎంపీపీఎస్‌లో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. మన ఊరు–మన బడి పనులను మొదటి విడతలో పూర్తి చేసి, హరితహారంలో భాగంగా బడిలో మొక్కలు నాటించారు. ఈ ఏడాది ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. 2006 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా పలువురు ఉద్యోగాలు సాధించారు.
ఇంగ్లిష్‌లో వందశాతం ఉత్తీర్ణత
రామడుగు(చొప్పదండి): రుద్రారం హైస్కూల్ ఇంగ్లిష్ టీచర్ కేఈ.శ్రవణ్‌కుమార్ విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేలా పాఠాలు బోధిస్తున్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆయన చొరవతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో విద్యార్థులు అవార్డులు సాధించారు. అలాగే పాఠశాలలో గత ఐదేళ్లుగా పదోతరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూస్తున్నారు.
ప్రొజెక్టర్ ద్వారా బోధన
మానకొండూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల టీచర్ ఆరెపల్లి జయప్రద గౌతమి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారు. ప్రభుత్వం ఆమెను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది.
జగ్గయ్యపల్లి ప్రాథమిక పాఠశాల..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆరేళ్లు మూతపడిన మల్యాల జగ్గయ్యపల్లె పాఠశాలను గతేడాది తిరిగి ప్రారంభించారు. టీచర్ షబానా గ్రామస్తులతో మాట్లాడి, ఒప్పించడంతో 5 తరగతులు 11 మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయి. ఆమె ఒక్కరే ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధిస్తున్నారు. ఆటపాటలతో బోధన చేస్తూ మధ్యాహ్నం మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు.
బడిని బతికించారు
మెట్‌పల్లి(కోరుట్ల): సింగపూర్ ప్రాథమిక పాఠశాల 2014లో మూతపడింది. ఇక్కడి ఉపాధ్యాయుడు సుధాకర్ డిప్యుటేషన్‌పై మరో పాఠశాలకు వెళ్లారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ విద్య ను ప్రవేశపెట్టడంతో గతేడాది పాఠశాల తెరుచుకుంది. ఆయన పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరడంతో వారు అంగీకరించారు. ప్రస్తుతం 15 మంది చదువుతున్నారు.
స్కూల్‌ను తెరిపించి
సైదాపూర్: మండల కేంద్రానికి చెందిన మారవేని మమత అమ్మనగుర్తి పీఎస్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. రూ.20 వేలతో ఎల్‌ఈడీ టీవీ, రూ.5 వేలతో కుర్చీలు సమకూర్చారు. వ్యాయామం, ఆటపాటలతో విద్యనందిస్తున్నారు. టీఎల్‌ఎం 2022–23కు మండల ప్థాయిలో పాఠశాలకు ఉత్తమ అవార్డు వచ్చింది. మమత కృషికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు వరించింది.
ఆకర్షణీయమైన చిత్రాలతో..
హుజూరాబాద్‌రూరల్: చెల్పూర్ హై స్కూల్ సోషల్ టీచర్ ఆర్.పవన్‌కుమార్ విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. రాష్ట్రస్థాయి సోషల్ స్టడీస్ ప్రతిభా పరీక్షలో ఈ స్కూల్ వి ద్యార్థి మూడో ర్యాంక్ సాధించాడు. జి ల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో మొదటి స్థానం సాధించారు. పవన్‌కుమార్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు.
విద్యార్థులకు అక్షరాభ్యాసం
జూలపల్లి(పెద్దపల్లి): వడ్కాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కరుణాకర్‌రెడ్డి చిన్నారులకు సులభమైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. స్కూల్లో చేరిన చిన్నారులకు పాఠశాల అవరణలోనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ముందు వరుసలో నిలిచారు.