Skip to main content

గ్రూప్స్‌ అభ్యర్థులు.. సర్టిఫికెట్ల కోసం పాట్లు

కరోనా సమయంలో మూతపడ్డ స్కూల్స్‌ రికార్డులను అప్పగించకపోవడంతో గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి ప్రైవేటు పాఠశాలలు మూతపడినట్టు సమాచారం. వరుస లాక్‌డౌన్ లు, ఆ తర్వాత కూడా సరిగా నడపలేకపోవడంతో చిన్న బడులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నాయి. దీంతో మూత వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో స్కూల్‌ రికార్డులను స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో అప్పగించాలి.. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి తెలియజేయాలి. కానీ మూతపడిన బడులు ఈ నిబంధనలు పాటించలేదు.
Students suffer for certificates
గ్రూప్స్‌ అభ్యర్థులు.. సర్టిఫికెట్ల కోసం పాట్లు

అసలు సమస్యేంటి?

  • ఇప్పటివరకూ 4–9 వరకు ఎక్కడ చదివితే దాన్ని స్థానికతగా భావించారు. గ్రూప్స్‌ నోటిఫికేషన్ లో 1–7వ తరగతి వరకు ఎక్కడ చదివారో అభ్యర్థులు ధ్రువీకరించాల్సి వస్తోంది.
  • సాధారణంగా ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత విద్యార్థి బదిలీ సర్టిఫికేట్, ఇతర ధ్రువపత్రాలు లేకున్నా ప్రాథమికోన్నత పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో చాలామంది 1–5 తరగతులు ప్రైవేటు స్కూల్లో చదివినా, అక్కడ్నుంచీ ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోలేదు.
  • ప్రైవేటు బడుల్లో ఫీజులు చెల్లిస్తే తప్ప టీసీలు ఇవ్వబోమని యాజమాన్యాలు హుకుం చేయ డం సర్వసాధారణం. టీసీ లేకున్నా పైతరగతు ల్లో చేర్చుకునే వెసులుబాటు ఉండటంతో చాలా మంది ఈ అవకాశాన్నే వినియోగించుకున్నారు.
  • కొంతమంది 1–5వరకు స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుని, తర్వాత డిగ్రీ వరకు ఇతర ప్రాం తాల్లో చదువుకున్నారు. ఇప్పుడు వీళ్లు విధిగా తమ సొంత ప్రాంతంలో ధ్రువీకరణ పొందాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలూ లేకపోవడంతో స్కూల్‌ సర్టిఫికెట్లపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి.
Sakshi Education Mobile App

కొరతే కారణమా?

మూతపడ్డ బడుల సమాచారం సేకరించడం, రికార్డులు తీసుకుని భద్రపర్చడం స్థానిక మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) బాధ్యత. ఆ తర్వాత డిప్యూటీ డీఈవో, ఆ పైన డీఈవో దీన్ని పర్యవేక్షిస్తారు. విద్యాశాఖలో కీలకమైన పర్యవేక్షణ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 539 ఎంఈవోల పోస్టులుంటే.. ప్రస్తుతం 16 మందే ఉన్నారు. 67 మంది డిప్యూటీ డీఈవోలు ఉండాల్సి ఉంటే, ఒక్కరూ లేరు. 12 డీఈవో పోస్టులకుగాను 8 మందే ఉన్నారు. ఈ ఖాళీలు పర్యవేక్షణలోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఫలితంగానే మూతపడ్డ బడుల రికార్డులు భద్రపరిచే వ్యవస్థ కరువైందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

స్థానికతకు మార్గమేంటి?

దీనికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులను కోరుతోంది. మూతపడ్డ బడుల రికార్డు లేనప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే బాగుంటుందని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, గెజిటెడ్‌ ధ్రువీకరణ, స్థానిక వ్యక్తుల హామీలు తీసుకుని దీన్ని పరిష్కరించవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, స్పష్టమైన ఆదేశాలు వస్తే ఆమేరకు ముందుకెళ్తామని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

సమస్య తీవ్రంగానే ఉంది..

మూతపడ్డ స్కూల్స్‌ రికార్డులను అప్పగించకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గురించి ఎంఈవోలు మా సంఘాన్ని సంప్రదిస్తున్నారు. మూతపడ్డ కాలేజీల నిర్వాహకుల ఫోన్ నంబర్లు అందుబాటులో లేవంటున్నారు. తక్షణమే రికార్డులు అప్పగించాలని మా సంఘం తరపున మూసి వేసిన స్కూల్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.
– వై.శేఖర్‌రావు (గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్య సంఘం అధ్యక్షుడు)

రికార్డు ఏమైందో?

కరీంనగర్‌ పక్కన కొత్తపల్లిలో ఉన్న న్యూ మిలీనియం స్కూల్లో నేను 4 నుంచి 6వ తరగతి వరకూ చదువుకున్నాను. స్టడీ, ఇతర సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించాను. నిర్వాహకులు చనిపోయారని, స్కూల్‌ మూతపడిందని తెలిసింది. నిర్వాహకుల సంబంధీకులతో మాట్లాడగా.. రికార్డులను ఎంఈవో ఆఫీసులో ఇచ్చామని చెప్పారు. ఎంఈవో ఆఫీసు వాళ్లేమో అసలా పేరుతో స్కూలే లేదంటున్నారు. రికార్డు ఏమైందో తెలియడం లేదు.
– సంపత్‌ (పెగడపల్లి ఎంఆర్‌వోలో కాంట్రాక్టు ఉద్యోగి)

Published date : 04 May 2022 12:56PM

Photo Stories