Skip to main content

నల్లమలలో కొత్త మొక్క.. గుర్తించిన బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల పరిశోధకులు

జడ్చర్ల టౌన్‌: నల్లమల అడవుల్లో సరికొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌ సదాశివయ్య వెల్లడించారు.
Researchers new plant identified in nallamala forest
నల్లమల అడవిలో పరిశోధక బృందం

తన పరిశోధక బృందంతో కలిసి గుర్తించిన ఆ మొక్కకు యూఫోర్బియా తెలంగాణేన్సిస్‌గా నామకరణం చేసినట్టు ప్రకటించారు. నవంబర్‌ 25న ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. సదాశివయ్య బృందం, ఏపీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్యుడు డాక్టర్‌ ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం నుంచి నిర్మలా బాబురావు, రామకృష్ణ సంయుక్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో గడ్డి జాతులపై పరిశోధన చేస్తున్నారు.

చదవండి: ISRO:‘గగన్‌యాన్‌’లో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష సక్సెస్‌

అటవీశాఖ సహకారంతో చేపట్టిన ఈ పరిశోధనలో ఒక కొత్త మొక్కను గుర్తించారు. అది రాజస్తాన్‌లో ఉండే యూఫోర్బియా జోధ్పూరెన్సిస్‌ అనే మొక్కను పోలి ఉందని.. కానీ కొన్ని లక్షణాల్లో వైవిధ్యం ఉండటంతో కొత్త మొక్కగా తేల్చామని పరిశోధక బృందం తెలిపింది. ఈ మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, కేవలం రెండు ప్రాంతాల్లోనే లభ్యమవుతుండటంతో అంతరించిపోతున్న మొక్కల జాబితా కింద చెప్పవచ్చన్నారు.కొత్త మొక్కను కనుగొన్న పరిశోధక బృందాన్ని తెలంగాణ ఉన్నతవిద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ అభినందించారు. 

చదవండి: DRDO: కరోనాతో దెబ్బతిన్న గుండెకు భారత ఔషధంతో చికిత్స

new plant identified in nallamala forest
నల్లమలలో కనుగొన్న కొత్త మొక్క 

 

మరింత అధ్యయనం చేస్తాం.. 

నల్లమలలో కనుగొన్న కొత్త మొక్కపై మరింత అధ్యయనం అవసరమని సదాశివయ్య చెప్పారు. ఈ మొక్క సుమారు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, మొత్తం పాల వంటి లేటెక్స్‌ (చిక్కని ద్రవం) ను కలిగి ఉంటుందన్నారు. ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ అడవుల్లో 5 కొత్త మొక్కలను కనుగొన్నామని, రాష్ట్రంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయని వివరించారు. కాగా.. నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యానికి కేంద్రమని, గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలు జరగలేదని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌ఓ రోహిత్‌ గోపిడి చెప్పారు. ప్రస్తుతం మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉందన్నారు. 

చదవండి: Israel: ఇజ్రాయెల్‌లో 3,700 ఏళ్ల క్రితంనాటి దంతపు దువ్వెన

Published date : 26 Nov 2022 03:06PM

Photo Stories