ISRO:‘గగన్‌యాన్’లో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష సక్సెస్
ఇంటిగ్రేటెడ్ మెయిన్‌పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్‌ఎఫ్‌ఆర్) నుంచి విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో నవంబర్ 19న నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్‌ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్‌యాన్ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్ సెంటర్ పేర్కొంది. ‘‘గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. ఆ్రస్టొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది. డీఆర్‌డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు.