CM Revanth Reddy: ఫార్మా సిటీలో పరిశోధనలకు ప్రాధాన్యం!
యాంటీ బయాటిక్స్, ఫెర్మెంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మెటిక్స్ సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.
పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా అందులో కోర్సులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
చదవండి: Pharmexcil Award: యూజియా ఫార్మాకు ఫార్మెక్సిల్ ప్లాటినం స్టార్ అవార్డు
సెప్టెంబర్ 9న సాయంత్రం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి గ్రీన్ ఫార్మాసిటీపై సీఎం రేవంత్ సమీక్షించారు. గ్రీన్ ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి దాని అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వేగంగా సదుపాయాల కల్పన
రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌జిల్లాల పరిధిలోని ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని సమీక్షలో సీఎం సూచించారు. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని.. పర్యావరణహితంగా, కాలుష్య రహితంగా ఉండేలా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
చదవండి: Oral Cholera Vaccine: మరణాలు తగ్గించడానికి.. భారత్ బయో నుంచి ఓరల్ కలరా వ్యాక్సిన్
గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగు నీరు, విద్యుత్, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ – లైఫ్ సైన్సెస్ కంపెనీలకు గ్రీన్ ఫార్మాసిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.