వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ ‘కలకలం’
మొదటి ఏడాది చదువుతున్న 25 మంది విద్యార్థులను ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలపై మొత్తం 34 మంది విద్యార్థులను హాస్టళ్ల నుంచి బహిష్కరించారు. ఇందులో తీవ్ర నేరం చేశారని భావిస్తున్న 25 మందిని రెండు వారాల పాటు తరగతులకు హాజరు కాకుండా కళాశాల ప్రాంగణం నుంచి బహిష్కరిస్తూ కళాశాల అసోసియేట్ డీన్, వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు విశ్వవిద్యాలయ వర్గాలు ఆదేశించాయి.
చదవండి: After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్ హోదా పొందొచ్చు...
ఏం జరిగిందంటే...!
రెండు, నాలుగో సంవత్సరం చదువుతున్న సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ హాస్టల్ వార్డెన్‌కు 25 మంది జూనియర్ విద్యార్థులు సీల్డ్ బాక్స్‌లో ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఘటనపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అక్టోబర్ 27వ తేదీన మొదటి ఏడాది చదువుకుంటున్న జూనియర్లను, 28న రెండు, నాలుగో ఏడాది చదువుతున్న సీనియర్లను విచారించి ఆరా తీసింది. విచారణ తర్వాత మొత్తం 34 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారిస్తూ అక్టోబర్ 29న సదరు కమిటీ నివేదిక ఇచి్చంది. ఇందులో 16 మంది రెండో ఏడాది విద్యార్థులు కాగా, 18 మంది నాలుగో ఏడాది విద్యార్థులున్నారు. నివేదిక ఆధారంగా 25 మందిని హాస్టల్–ఏ నుంచి బహిష్కరించడంతో పాటు తరగతులకు కూడా రెండు వారాల పాటు హాజరు కావద్దని ఆదేశించారు. అదే విధంగా మరో 9 మందిని అన్ని హాస్టళ్ల నుంచి బహిష్కరించడంతో పాటు కళాశాల వాహనాలు ఎక్కవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ర్యాగింగ్‌లో భాగంగా మొదటి ఏడాది చదువుతున్న జూనియర్లను సీనియర్లు కొందరు నగ్నంగా నిలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.