Veterinary Digital Studio: జాతీయ గుర్తింపు
ఆర్బీకే చానల్‌తో పాటు జాతీయ స్థాయిలో ప్రసార భారతి, కిసాన్ వాణి ద్వారా ప్రసారమవుతూ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మేరకు ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్‌కు అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గతేడాది ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ స్టూడియో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రైతుల ప్రయోజనాల కోసం ఈ స్టూడియోలో లఘుచిత్రాలతో పాటు ఆడియో, వీడియోలను రికార్డు చేస్తున్నారు. పాడి పశువులు, పెరటికోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం, మార్కెటింగ్, విలువ ఆధారిత పదార్థాల తయారీ తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి తక్కువ నిడివి గల వీడియోలను తయారు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార కేంద్రంలో నిర్వహించే రైతు శిక్షణ కార్యక్రమాలను వీడియో రికార్డింగ్, ఎడిట్ చేసి భద్రపరుస్తున్నారు. ఎస్‌వీవీయూ విద్యార్థులు, పశు వైద్యాధికారుల కోసం టీచింగ్ మాడ్యూల్స్‌ను తయారు చేస్తున్నారు. వివిధ అంశాలపై ఇక్కడ రూపొందించిన వీడియోలు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. వీటిని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో భద్రపర్చి ఆర్బీకేల్లోని స్మార్ట్ టీవీల ద్వారా పాడి రైతులకు అవసరమైనప్పుడల్లా ప్రసారం చేస్తున్నారు. మూగ, సన్న జీవాలకు సంబంధించి వివిధ అంశాలపై శాస్త్రవేత్తల ద్వారా ఇప్పటివరకు 52 రేడియో ట్రాక్స్ రికార్డ్ చేశారు. వీటిని ప్రసార భారతి (ఎఐఆర్)లో కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా ప్రసారం చేస్తుండగా విశేష ఆదరణ పొందుతున్నాయి.
విశేష ఆదరణ లభిస్తోంది
రైతులకు అవసరమైన అంశాలపై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా ఎస్‌వీవీయూ స్టూడియోలో అత్యాధునిక టెక్నాలజీతో ఆడియో, వీడియో ట్రాక్స్ రూపొందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సౌండ్ ప్రూఫ్, గ్రీన్ మ్యాట్ రూమ్‌లో రికార్డ్ చేసి ప్రసారం చేస్తున్నాం. ప్రసార భారతి (ఏఐఆర్)లో కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా ప్రసారమైన ట్రాక్స్‌కు విశేష ఆదరణ లభించింది.
– కె.సుజాత, కో–ఆర్డినేటర్, ఎస్వీ యూనివర్సిటీ కేవీకే