Skip to main content

Libraries: గ్రంథాలయాలకు నూతన శోభ

రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థకు ప్రభుత్వం సరికొత్త శోభను తీసుకొస్తోంది. అధునాతన సౌకర్యాలతో విజ్ఞాన భాండాగారాలను తీర్చిదిద్దుతోంది.
Libraries
గ్రంథాలయాలకు నూతన శోభ

తొలి దశలో ఏడు జిల్లాల్లో శాఖ, జిల్లా గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తోంది. మరికొన్ని గ్రంథాలయాల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఇటీవల పోటీ పరీక్షల్లో కొలువులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రంథాలయాల్లో చదివినవారే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో గ్రంథాలయాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. విద్యార్థులు, అభ్యర్థులకు మేలు చేస్తూ ఇటీవల కొత్త సిలబస్‌కు తగ్గట్టుగా రూ.9.73 కోట్లతో 1.60 కోట్ల కొత్త పుస్తకాలను కొనుగోలు చేసింది. దీంతో పాటు గ్రామాల్లో బీడీసీ(బుక్‌ డిపాజిట్‌ సెంటర్‌) పేరుతో ఉదయం, సాయంత్రం వేళల్లో చదువరుల కోసం ప్రత్యేక సెంటర్లు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉమ్మడి విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 14 శాఖా గ్రంథాలయాలకు నూతన భవనాలు, 20 గ్రంథాలయాల్లో మరమ్మతులకు రూ.7.95 కోట్ల అంచనాకు తగ్గట్టుగానే మొత్తం పరిపాలన అనుమతులిచ్చి పనులు ప్రారంభించింది. నెల్లూరులో రూ.3.48 కోట్ల అంచనాతో మూడు జిల్లా గ్రంథాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇప్పటికే రూ.98.50 లక్షలు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసేలా పనులు చేస్తోంది. తొలుత గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తి చేసి ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా తొలి అంతస్తును కూడా నిర్మించేలా ప్రణాళికలు రచిస్తోంది. 

చదవండి: పోటీ పరీక్షలకు ‘ప్రైవేటు’ చదువు!

పేద విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు చేకూర్చేలా..

అధునాత సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా గ్రంథాలయాలకు ఎక్కడా ఆదరణ తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 987 గ్రంథాలయాలుండగా వాటిల్లో 8.56 లక్షల మందికి సభ్యత్వం ఉంది. రోజుకు సగటున 2.01 కోట్ల మంది లైబ్రరీల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో గ్రంథాలయాలను అందుబాటులోకి తేవడం వల్ల పేద, బడుగు వర్గాల విద్యార్థులకు, స్కాలర్లకు, నిరుద్యోగులకు ఎంతో లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

చదవండి: Books: పుస్తకాలతో దోస్తీ.. – careof అఫ్జల్‌గంజ్‌

గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గ్రంథాలయ సంస్థల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ఎంపిక చేసిన చోట నూతన భవనాలు నిర్మిస్తున్నాం. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్‌.. గ్రంథాలయ వ్యవస్థను విప్లవాత్మకంగా మారుస్తున్నారు.
– మందపాటి శేషగిరిరావు, చైర్మన్, ఏపీ గ్రంథాలయ పరిషత్‌ సంస్థ

Published date : 22 Jul 2022 01:51PM

Photo Stories