Skip to main content

Medical College: కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!.. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్‌ అగమ్య గోచరం

సాక్షి, అమరావతి: ‘‘కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఏర్పాటై అదనంగా సీట్లు వస్తే ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. నూతన వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారింది. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది.
medical college students future trouble chandrababu wrong decisions

ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది..’’ ఇదీ వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ రంగంలో మనకు అదనంగా మెడికల్‌ సీట్లు సమకూరుతుంటే ఏ రాష్ట్రమైనా వద్దనుకుంటుందా? కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాసిన ఉదంతం ఎక్కడైనా ఉందా? కాలేజీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూర్చుకునేందుకు మరికొంత సమ­యం తీసుకోవాలని కేంద్రం ఉదారంగా ఆఫర్‌ ఇస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేట్‌ మోజుతో అలాగే వ్యవహరిస్తున్నారు. 

మన విద్యార్థుల ఎంబీబీఎస్‌ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభు­త్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం (పీ–4) అని నమ్మ­బలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగనమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరు చేసినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యవహరించని విధంగా ఆ సీట్లు మాకొద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసి దుర్మారంగా అనుమతులను రద్దు చేయించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

చదవండి: 1,284 Jobs: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. చివ‌రి తేదీ, ఇత‌ర వివ‌రాల కోసం క్లిక్ చేయండి

2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా సమకూరి తమకు తెల్ల కోటు ధరించే అవకాశం దక్కుతుందని ఆశపడ్డ వారంతా సర్కారు తీరు­పై నివ్వెరపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లను రద్దు చేస్తామని హామీలిచ్చిన టీడీపీ ఇప్పుడు ఏకంగా వాటికి బేరం పెట్టి తీరని ద్రోహం తల పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలనూ నిలిపివేయడంతో రాష్ట్రం మరో 1,050 ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోనుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా పెరిగి తమకు వైద్య విద్య చదివే అవకాశం దక్కుతుందనే ఆశతో రూ.లక్షలు  పెట్టి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లు తీసుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. 

ఈ నిర్వాకం ఖరీదు.. 1,750 సీట్లు 

వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరుల్లో ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లతో ఐదు కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కారు నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. గతేడాది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా సమకూరాయి. 

ఈ ఏడాదీ అదే మాది­రిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్‌ సీట్‌ లభిస్తుందని నీట్‌ రాసి అర్హత సాధించిన విద్యార్థుల భవి­ష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1,750 మంది విద్యార్థులు వైద్య విద్య అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్‌ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. 

ఆల్‌ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్‌ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో నాలుగు కళాశాలలు వెనుకబడిన రాయ­లసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. తమ పిల్లల­ను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరుపేద, మధ్య­తరగతి కుటుంబాలకు చెందిన పలువురు రూ.లక్షల్లో అప్పు­లు చేసి విజయవాడలో ఇంటర్‌తోపాటు నీట్‌ యూజీ కోచింగ్‌లలో చేరి్పంచారు. గతంలో చివరి కటాఫ్‌ ర్యాంక్‌ వరకూ వచ్చి అవకాశం దూరమైన విద్యార్థులు ఈసారి సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో విలువైన సమయాన్ని, డబ్బులను వెచ్చించి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లు తీసుకున్నా­రు. 


ఇంత అనుకూల పరిస్థితులున్నా.. 

వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎంలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రత్యేకంగా కలిసి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి మరీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు, అదనపు ఎంబీబీఎస్‌ సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే ఏపీలో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయని సోషల్‌ మీడియాలో విమర్శలు వైరల్‌ అవుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 

బీజేపీకి చెందిన సత్యకుమార్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు కొత్త మెడికల్‌ కళాశాలలు ప్రారంభించి వంద శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి.. ఎన్‌ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

2014–­19 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినప్పుడు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు నిరాకరించటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తొలి నుంచి ప్రైవేట్‌ వైద్య విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెట్టే తంతుకు తెర తీశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  

బుకాయించి.. బుక్‌ అయిన ప్రభుత్వం

ఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయ­త్నం చేయలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం కచిన వసతుల ఆధారంగా ఎన్‌ఎంసీ పాడేరు కాలేజీకి 50 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న­ందున గత్యంతరం లేక చంద్రబాబు సర్కారు మిన్నకుంది. అంతకంటే ముందు పులివెందుల మెడికల్‌ కాలేజీకి కూడా గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా 50 సీట్లకు ఎన్‌ఎంసీ లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌(ఎల్‌ఓపీ) మంజూరు చేసింది. 

అయితే ఎల్‌ఓపీని తొక్కిపెడుతూ మీరు అనుమతులు ఇచ్చి­నా మేం కళాశాలను నిర్వహించలేమంటూ గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్‌ఎంసీకి లేఖ రాసింది. బయటకేమో ఎల్‌ఓపీ రాలేదని బుకాయిస్తూ వచ్చింది. ఎల్లో మీడియాలో సైతం అదే తరహాలో వార్తలు రాయించారు. ప్రభు­త్వం గుట్టుగా లేఖ రాసిన విషయాన్ని ‘సాక్షి’ బట్ట బయలు చేసింది. ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతోనే ఎల్‌ఓపీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఎన్‌ఎంసీ కూడా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లూ ఎల్‌ఓపీ రాలేదని బుకాయించిన కూటమి సర్కార్‌ మోసాలు బహిర్గతమయ్యాయి.

మోసం చేశారు.. 
ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది. ఈ ఏడాది 750 సీట్లు అదనంగా సమకూరి ఉంటే కాస్త ర్యాంకు తగ్గినా అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేది. నా బిడ్డ నీట్‌ రాసింది. ఐదు కొత్త కళాశాలలు ప్రారంభమైతే సీట్‌ వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. యాజమాన్య కోటా కింద సీట్‌ కొనే స్థోమత మాకు లేదు. మాలాంటి వాళ్లను మోసం చేశారు.  
– నెహేమియా, నెల్లూరు, నీట్‌ రాసిన విద్యార్థి తండ్రి  

తప్పుడు నిర్ణయాలతో గందరగోళం 
ఏడాది లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తర్వాత మా అబ్బాయి 541 స్కోర్‌ సాధించాడు. బీసీ–డీ రిజర్వేషన్‌ కింద గతేడాది 497 స్కోర్‌కు ప్రైవేట్‌లో చివరి సీట్‌ వచ్చింది. ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కళాశాలలకు అనుమతులు వస్తే మా అబ్బాయికి సీట్‌ వస్తుందనే  ఆశ ఉండేది. ఎస్‌వీ రీజియన్‌లోనే మూడు కళాశాలల ఏర్పాటుతో 450 సీట్లు సమకూరేవి. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది.  మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు కొనే స్థోమత లేదు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా బాబు భవిష్యత్‌ గందరగోళంగా మారింది.  
– కోడూరు పెంచలయ్య, అన్నమయ్య జిల్లా 

తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవద్దు 
నా కుమార్తె రష్యాలోని కజికిస్తాన్‌లో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానికంగానే మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి రావడం ఎంతో శుభ­పరిణామం. అలాంటిది ప్రస్తుత టీడీపీ ప్రభు­త్వం ఆదోని మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు నిలిపి­వే­యాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధ కలిగించింది. పులివెందులకు వచ్చిన సీట్లనూ వద్దనుకుంది. ఈ చర్య ముమ్మాటికీ తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవటమే. స్థానికంగానే మెడికల్‌ సీట్లు లభిస్తే నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు వ్యయ ప్రయాసల కోర్చి పిల్లలను విదేశాలకు పంపే అవసరం ఉండదు.  
– ఎం.చెన్నయ్య, వైద్య విద్యార్థిని అమూల్య తండ్రి, ఆదోని 

ఉచిత వైద్యం దూరం చేసే కుట్ర 
మెడికల్‌ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్‌ విద్యనే కాదు. పేదలకు ఉచితంగా సూపర్‌ స్పెషా­లి­టీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కా­లేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. దాంట్లో అనుభవజు్ఞలైన వైద్యులు అందుబా టులోకి వస్తారు. వసతులు పెరుగు­తాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలను ప్రైవేట్‌ పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. 
– నూర్జహాన్, వేముల, వైఎస్సార్‌ జిల్లా 

ఆశలు నీరు గార్చారు
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఏర్పాటై కొత్తగా సీట్లు వస్తే నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతో మంది ఆశ పెట్టుకున్నాం. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది.  
– పూర్ణిమ, నీట్‌ విద్యార్థిని, చిత్తూరు జిల్లా

Published date : 14 Sep 2024 09:24AM

Photo Stories