TSCHE: డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్
ప్రభుత్వ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో దీన్ని ముందుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఆసక్తి చూపిస్తే వాటిలోనూ అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంచైజ్ అలయెన్స్ ఆర్గనైజేషన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ఫ్రెంచ్ భాషను తీసుకురావడంపై కొన్నాళ్లు కసరత్తు చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఫ్రాన్స్ విదేశీ మంత్రిత్వశాఖతో కలిసి రాష్ట్రంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓయూ పరిధిలోని కాలేజీల్లో 2022లో ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రవేశపెట్టి, 2023 నుంచి ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు విస్తరిస్తారు. ఇప్పటివరకూ హిందీ, తెలుగు సహా ఇతర భాషలు డిగ్రీలో ద్వితీయ భాషలుగా ఉన్నాయి. అయితే, ఫ్రెంచ్ భాషను రాష్ట్రంలో డిప్లొమా, ఇతర సర్టిఫికెట్ ప్రోగ్రాములుగా అందించారు. కొన్నేళ్లుగా కొంతమంది ఈ సబ్జెక్టులను నేర్చుకున్నారు. సీనియర్ డిప్లొమా చేసిన వాళ్లు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వీళ్లను ఫ్రెంచ్ అధ్యాపకులుగా గుర్తించబోతున్నారు. వీరికి బోధనకు అనుకూలంగా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని ఓయూ అధికారులు తెలిపారు.
చదవండి: బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు
ఉపాధి అవకాశాలు
ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం వల్ల బహుళజాతి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్నేళ్లుగా చూస్తే రాష్ట్రంలో ఈ తరహా భాష మిళితమైన కార్పొరేట్ సంస్థల వ్యాపార లావాదేవీలు పెరిగాయి. సంస్థల ఏర్పాటు విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీల్లో ఫ్రెంచ్, ఇతర విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. భవిష్యత్‌లో డిగ్రీ స్థాయిలో ఫ్రెంచ్‌తో పాటు జర్మనీ ఇతర కోర్సులు అందుబాటులోకి తెచ్చే వీలుంది. పీజీలోనూ ఈ భాషల ప్రాధాన్యత పెరిగే అవకాశముంది.
– ప్రొఫెసర్ డి.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ
చదవండి: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం..డిమాండ్ ఉంటేనే అనుమతి..
ఫ్యాకల్టీ సిద్ధం: చైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి
ఫ్రెంచ్ భాషను ద్వితీయ భాషగా తెచ్చేందుకు కొన్నేళ్లుగా చేస్తున్న కృషి 2022లో కార్యాచరణకు నోచుకుంటోంది. మంచి పాఠ్య ప్రణాళికతోపాటు సుశిక్షితులైన బోధకులను సిద్ధం చేశాం. ఈ భాష నేర్చుకున్న విద్యార్థి మంచి ఉద్యోగాలు పొందే వీలుంది. ఫలితంగా డిగ్రీ కోర్సులు మరింత ఆదరణ పొందుతాయి.