బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు
ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతుండటంతో.. ఆలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించిన బీసీ గురుకుల సొసైటీ, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క గురుకుల డిగ్రీ కాలేజీ ఉంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా డిగ్రీ కాలేజీల కోసం సొసైటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుండగా.. మంత్రి గంగుల కమలాకర్ చొరవతో ప్రభుత్వం కాలేజీలను మంజూరు చేసింది. ఆలస్యంగా మంజూరైనప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన గురుకుల సొసైటీ.. యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టింది. అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రవేశాలకోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. బీఎస్సీ, బీజెడ్సీ జనరల్ కోర్సులతో పాటు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అనలిటిక్స్, డాటాసైన్స్, జియోగ్రఫీ, సైకాలజీ, సోషియాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ, బీఏహెచ్‌ఈపీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకుల సొసైటీ స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఉన్న కొన్ని పట్టణాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
చదవండి: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం..డిమాండ్ ఉంటేనే అనుమతి..
తాత్కాలిక పద్ధతిలో ఫ్యాకల్టీ..
డిగ్రీ కాలేజీల నిర్వహణను ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో చేపట్టాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ కాలేజీలకు ప్రిన్స్‌పాళ్లుగా ఉద్యోగ విరమణ పొందిన లెక్చరర్లు, ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఈమేరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. మరోవైపు ఫ్యాకల్టీని సైతం తాత్కాలిక పద్ధతిలో ఎంపిక చేయాలని యోచిస్తోంది.