Skip to main content

High Court: ఆ ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే..

సాక్షి, హైదరాబాద్‌: వైద్య కళాశాలలు 2017–20 విద్యా సంవత్సరంలో తమనుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాల్సిందేనని ఎంబీబీఎస్‌ విద్యార్థులు హైకోర్టులో వాదించారు.
High Court
ఆ ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే..

2022లో ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించేలా ఉత్తర్వులు జారీ చేయాలని వారి తరపున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తమ వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పునిచ్చిందని, వాదనలు వినాలని వైద్య కళాశాలల యాజమాన్యాలు వాదించాయి. 2017–20 విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం ఫీజులు నిర్ణయిస్తూ జారీ చేసిన జీవోలను గతంలో హైకోర్టు రద్దు చేసింది. తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్‌ఆర్‌) సిఫార్సుల మేరకు ఫీజులు ఉండాలంది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్‌లతో పాటు కళాశాలలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం జూన్‌ 21న విచారణ చేపట్టింది.

చదవండి: National Medical Commission: చేరిన వైద్య కళాశాలలోనే చదువు పూర్తి.. ఇకపై ఇంటర్న్‌షిప్‌ ఇలా..

నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని, ఎక్కువ వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి చెల్లించాలన్న ఉత్తర్వుల్ని కళాశాలలు అమలు చేయలేదని సందీప్‌రెడ్డి పేర్కొన్నారు. టీఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల మేరకు ఫీజులు ఉండాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని చెప్పారు. ప్రైవేటు కళాశాలల తరపున సీనియర్‌ న్యాయవాదులు దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి, శ్రీరఘురాం, దామా శేషాద్రినాయుడు వాదించారు. టీఏఎస్‌ఆర్‌సీ 2016 నుంచి ఫీజులు పెంచలేదని, ఆ కమిటీ ఫీజులను నిర్ణయిస్తే అభ్యంతరం లేదని చెప్పారు. 2017–20 విద్యా సంవత్సరాలకు సర్కార్‌ పెంచిన ఫీజుల పెంపు నామమాత్రమేనని వివరించారు. దీన్ని సవాల్‌ చేసిన పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉందని చెప్పారు. విద్యార్థులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్ల విచారణ సమయంలో కాలేజీల వాదనలు వినలేదని, మరోసారి వినాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జూన్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.  

చదవండి: FMGE June 2023/Exam: స్వదేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి అవకాశం మెడికల్‌ ప్రాక్టీస్‌కు ఎఫ్‌ఎంజీఈ

Published date : 22 Jun 2023 04:17PM

Photo Stories