Madhusudan Rao: ప్రతి టీచరూ కొత్తగా ఆలోచించాలి
కేజీబీవీల్లో కొత్తగా నియామకమైన సీఆర్టీలు, పీజీటీలకు అనంతపురం శివారులోని వైటీ శివారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఇండక్షన్ శిక్షణ’ తరగతులు ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన శిక్షణా తరగతులు నవంబర్ 21న ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. జ్ఞానం, భాష, నడక, ఆహార్యం తదితర అంశాల్లో పిల్లలకు టీచర్లు రోల్ మోడల్‌గా నిలవాలన్నారు.
చదవండి: 10th Class Success Tips: ప్రతి రోజు బడి... హోమ్ వర్క్ తో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విజయం!
అనాథ, తల్లో తండ్రో లేని, నిరుపేద ఆడపిల్లలు చదువుకునే కేజీబీవీల్లో ఆయా పిల్లల ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. డీఈఓ నాగరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ వరప్రసాదరావు, జీసీడీఓ మహేశ్వరి మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న విలువైన అంశాలను కేజీబీవీల్లో అమలు చేసి విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ చంద్రమోహన్‌రెడ్డి, అలెస్కో గోవిందరెడ్డి, ఎంఈఓలు గురుప్రసాద్, ఓబుళపతి, అసిస్టెంట్ సీఎంఓ గోపాలకృష్ణయ్య, అసిస్టెంట్ ఏఎంఓలు మాధవరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా పని చేయాలి
‘మీరు చెప్పే చదువుతోనే నిరుపేద పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాంటి వృత్తిలోకి వచ్చిన మీరందరూ బాధ్యతగా పని చేయాలి’ అని కేజీబీవీ ఉపాధ్యాయులకు మధుసూదన్‌రావు సూచించారు. నవంబర్ 21న ఆయన రాప్తాడు, గార్లదిన్నె కేజీబీవీలను తనిఖీ చేశారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. నోట్ బుక్‌ల కరెక్షన్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలు తప్పులుగా రాసిన వాటిని కరెక్షన్ చేయకపోతే వారికి ఎలా తెలుస్తుందని సీఆర్టీలను ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తు టీచర్లపైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని అందుకు తగ్గట్టు పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.