Skip to main content

Education World India Rankings: మహిళా డిగ్రీ కళాశాల.. ‘సీమ’కే మకుటం

వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు, మౌలిక సదుపాయాలు, బోధన, స్కిల్స్‌, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ర్యాంకింగ్స్‌ ప్రకటించింది.

ఇందులో స్వయంప్రతిపత్తి కలిగిన మహిళా కళాశాలల విభాగంలో కడప ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రాయలసీమస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.

చదవండి: Admisisons Into Telangana Womens University: సైకాలజీ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కో ఎడ్యుకేషన్‌ విభాగంలో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ప్రథమస్థానంలో నిలవగా, కోటిరెడ్డి కళాశాల రాయలసీమ స్థాయిలో మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.

అదే విధంగా రాష్ట్రస్థాయిలో 7వ స్థానం, జాతీయస్థాయిలో 451వ స్థానంలో నిలిచి జిల్లాఖ్యాతిని చాటిచెప్పింది. 1973లో ఏర్పాటైన కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మందికి విద్యాసుగంధాలు వెదజల్లుతోంది. తాజా ర్యాంకింగ్‌తో కళాశాల ప్రగతిసిగలో మరో మణిహారం చేరినట్లయింది.

  • రాయలసీమ స్థాయిలో ప్రథమస్థానం
  • రాష్ట్ర స్థాయిలో 7వ, జాతీయస్థాయిలో 451వ స్థానం

చాలా సంతోషంగా ఉంది

ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ సంస్థ ఇచ్చిన సర్వేలో కళాశాల జాతీయ స్థాయిలో 451వ స్థానం, రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. అధ్యాపకులు, విద్యార్థులందరి సమిష్టికృషితో రానున్న రోజుల్లో మరింత మెరుగైన ర్యాంకింగ్‌ సాధించేందుకు కృషిచేస్తాం. 
– డాక్టర్‌ వేమల సలీంబాషా, ప్రిన్సిపాల్‌, ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌

Published date : 11 Sep 2024 03:41PM

Photo Stories