సాక్షి, హైదరాబాద్: 2022–23 వైద్య విద్య సంవత్స రానికి పీజీ వైద్యవిద్యలో సీటు పొందిన అభ్యర్థులు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది రుసుముకు కూడా కాలేజీలో చేరే సమయంలోనే బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలంటూ ప్రైవేటు వైద్య కళాశాలలు ఒత్తిడి తేవడాన్ని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అడ్డుకట్ట వేసింది.
నెల రోజులు బ్యాంకు గ్యారంటీ అడగొద్దు
కళాశాలలో చేరిన ఒక నెల రోజుల తర్వాత వరకూ బ్యాంకు పూచీకత్తు సమర్పించడానికి ప్రభుత్వమే వెసులుబాటు కల్పించిందనీ, ఒత్తిడి చేయకుండా కళాశాలల్లో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ కాలేజీలకు నవంబర్ 10న ఆరోగ్య వర్సిటీ లేఖ రాసింది. జీవో నంబరు 107 ప్రకారం కళాశాలలో చేరిన నెల రోజుల వరకూ బ్యాంకు పూచీకత్తు సమర్పించడానికి గడువు ఉంటుందని అందులో స్పష్టంగా పేర్కొంది.