UGC: 15 ఏళ్లు నిండితే డీమ్డ్ హోదా!
మరికొన్ని డిగ్రీ కాలేజీలూ ఈ హోదా పొందే సూచనలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొస్తున్న సవరణలే ఇందుకు కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు డీమ్డ్ వర్సిటీలున్నాయి. ఈ హోదా దక్కాలంటే ప్రస్తుతం కఠిన నిబంధనలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తూ హోదా పొందడం కాలేజీలకు కష్టసాధ్యంగా ఉండేది.
చదవండి: IIT Mandi: ఇంటి వెలుగుతో విద్యుత్తును సృష్టించిన ఐఐటీ మండీ
అయితే దేశవ్యాప్తంగా వస్తున్న విద్యా సంస్కరణల్లో భాగంగా ఇందుకు సంబంధించిన నిబంధనలు సరళతరం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రూపొందించి రాష్ట్రాలకు పంపింది. దాదాపు అన్ని రాష్ట్రాలూ దీనిపై సలహాలు, సూచనలు ఇచ్చాయి. దీని ఆధారంగా యూజీసీ మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నంలో ఉంది. త్వరలో దీనిపై స్పష్టత ఇవ్వనుందని యూజీసీ వర్గాలు తెలిపాయి.
చదవండి: Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!
న్యాక్‌లో 3.01 పాయింట్లు చాలు
ప్రస్తుతం ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు సంబంధిత యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాల ప్రక్రియ కూడా రాష్ట్ర సంస్థల అదీనంలో ఉంటుంది. అదే డీమ్డ్ వర్సిటీ గుర్తింపు దక్కితే కాలేజీలు స్వతంత్ర వర్సిటీలుగా మారతాయి. ప్రవేశాలు మొదలు, పరీక్షల వరకు సంబంధిత డీమ్డ్ వర్సిటీ పరిధిలోనే ఉంటాయి. ఫీజుల విషయంలోనూ ప్రభుత్వ ఆధిపత్యం ఉండదు. బోధన ప్రణాళిక కూడా సొంతంగా రూపొందించుకునే వీలుంది. అయితే ఈ హోదా రావాలంటే కఠినమైన నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి.
చదవండి: Liver treatment: కుష్టు బ్యాక్టీరియాతో కాలేయ చికిత్స
ఈ నేపథ్యంలోనే నిబంధనలు సడలించాలని యూజీసీ నిర్ణయించింది. డీమ్డ్ హోదా పొందాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కాలేజీ స్థాపించి 20 ఏళ్లు నిండి ఉండాలి. తాజాగా దీనిని 15 ఏళ్లకు తగ్గించనున్నారు. నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)లో మూడుసార్లు ‘ఏ’గ్రేడ్ పొంది ఉండాలి. న్యాక్‌లో 4 పాయింట్లకు కనీసం 3.26 పాయింట్లు సాధించాలి. దీనిని సవరిస్తూ 3.01 పాయింట్లు ఉంటే సరిపోయేలా మార్చనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 440 ప్రైవేటు వర్సిటీలు ఉంటే 170 మాత్రమే డీమ్డ్ వర్సిటీలున్నాయి. ఇప్పుడీ సంఖ్య 250కి చేరవచ్చని యూజీసీ అంచనా వేస్తోంది. అయితే కాలేజీలను డీమ్డ్‌గా మారిస్తే యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు దండుకునే వీలుందని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.