Engineering Counselling 2024: ఏపీ ఈఏపీ సెట్ 2024 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
భీమవరం: ఇంజినీరింగ్ అడ్మిషన్లకు కళాశాలలు సిద్ధమవుతున్నాయి. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ర్యాంకులను ప్రకటించడంతో రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 15 ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 12 వేల సీట్లకు గాను 8,500 కన్వీనర్ కోటా, 3,600 వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. కళాశాలలో ప్రవేశాల కోసం ఈ నెల 1వ తేదీన రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, 10వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్ జరుగుతాయి. అలాగే 8 నుంచి 12వ తేదీ వరకు ఐచ్చికాల ఎంపిక, మార్పులకు 13వ తేదీ, 16న సీటు కేటాయింపు, 17 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు కళాశాలలో జాయిన్ కావడానికి అవకాశముంది. ఈనెల 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: AP EAMCET College Predictor
ర్యాంక్ ఆధారంగా సీట్ల భర్తీ
ర్యాంక్ ఆధారంగా సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. బీటెక్‌లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు నచ్చిన బ్రాంచ్, కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రధానంగా బ్రాంచ్ ఎంపికలోనూ కచ్చితమైన నిర్ధారణకు రావాలి.
అటానమస్ కళాశాలల్లో పెరగనున్న సీట్లు
ఏపీ ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు సాధించలేకపోయామనే భయం అవసరం లేదు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎత్తివేసింది. దీంతో అటానమస్ కళాశాలలు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అదనపు సీట్ల కోసం ఆయా కళాశాలలు ఏఐసీటీఈ దరఖాస్తు చేసుకుంటే సీట్ల పెంపుదలపై నిర్ణయం తీసుకుంటారు. దీంతో అన్ని బ్రాంచ్‌లలో సీట్లు పెంచుకునే అవకాశం ఏర్పడింది.
కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలు ఇవే
ఏపీ ఈఏపీసెట్–2024 ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష మార్కుల జాబితా, పుట్టిన తేదీ ధ్రువపత్రం కోసం టెన్త్ మార్కుల జాబితా, బదిలీ సర్టిఫికెట్ (టీసీ), స్టడీ సర్టిఫికెట్స్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు, ఆర్థికంగా వెనుకబడినవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్–2025 వ్యాలిడిటీ (ఓసీ విద్యార్థులు), బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు.
విద్యార్థి ఆసక్తిని బట్టి బ్రాంచ్ ఎంపిక
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇతరులెవరో చెప్పారని బ్రాంచ్‌లను ఎంపిక చేసుకుని చేరిన తర్వాత పూర్తిస్థాయిలో చదువుపై దృష్టి పెట్టకపోతే లకా్‌ష్య్‌న్ని సాధించలేరు. ఇంజినీరింగ్‌లో అన్ని బ్రాంచ్‌లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. విద్యార్థి ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌లో రాణిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేటివ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి సారించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫలానా బ్రాంచ్‌లోనే బీటెక్ చేయాలి అంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయడం కంటే విద్యార్థి అభిరుచి, ఆసక్తిని పరిగణనలోని తీసుకుని చేర్పించడం మంచిది.
– నూకల గోపాలకృష్ణ, టెక్నాలజీ సెంటర్ హెడ్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం