Skip to main content

AP EAPCET 2024 Counselling: ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు ఫస్ట్‌.. ఈసీఈ సెకండ్‌ సీట్లు భర్తీ

AP EAPCET 2024 Counselling: ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు ఫస్ట్‌.. ఈసీఈ సెకండ్‌ సీట్లు భర్తీ
AP EAPCET 2024 Counselling: ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు ఫస్ట్‌.. ఈసీఈ సెకండ్‌ సీట్లు భర్తీ

అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు హాట్‌ కేకులను తలపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ సీట్ల తొలి విడత కౌన్సెలింగ్‌లో 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా తొలి దశలో 1,17,136 సీట్లు భర్తీ అవడం విశేషం. 19,524 సీట్లు మలి విడత కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయిస్తారు. 

విద్యార్థులు కంప్యూటర్‌ సైన్సుకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత ఈసీఈకి డిమాండ్‌ ఉంది.  కాలేజీలు కూడా ఇదే దృష్టితో కంప్యూటర్‌ సైన్సు సీట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాయి. ఈ మేరకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి.

ఇదీ చదవండి:  Supreme Court: నీట్‌–యూజీ సెంటర్ల వారీగా ఫలితాలు

కంప్యూటర్‌ సైన్స్‌లోనే ఎక్కువ..
కంప్యూటర్‌ సైన్స్‌లో కన్వీనర్‌ కోటాలో 42,303 సీట్లు ఉండగా, 40,242 సీట్లు తొలి దశలోనే భర్తీ అయ్యాయి. అంటే సీట్లన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ)లో 24,121 సీట్లు ఉండగా, 21,060 సీట్లను కేటాయించారు. సీఎస్‌ఈ (ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌)లో 11,156 సీట్లకు గాను 10,133 సీట్లు భర్తీ అయ్యాయి. ఫెసిలిటైస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌లో 66 సీట్లలో ఒక్కటి కూడా భర్తీ కాలేదు. 

కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో 64 సీట్లకు గాను 7 సీట్లే భర్తీ అయ్యాయి. తొలి దశ కౌన్సెలింగ్‌ 17వ తేదీతో ముగిసింది. శుక్రవారం నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో మిగిలిన 19,524 సీట్లకు వచ్చే వారంలో మలి విడత కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. దానికంటే ముందే ఎన్‌ఆర్‌ఐ, కేటగిరీ–బి సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. చివరి దశలో కళాశాలలకు స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించనుంది.

వైఎస్‌ జగన్‌ దార్శనికతతో..
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దార్శనికత, సంస్కరణలతో మెరిట్‌ సాధించిన పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా ప్రైవేటు వర్సిటీల్లో సీట్లు సాధించుకోగలిగారు. రాష్ట్రంలో 9 ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో గ్రీన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ ఫీల్డ్‌ వర్సిటీల్లో 70 శాతం సీట్లను ఏపీఈఏపీసెట్‌లో మెరిట్‌ సాధించిన విద్యార్ధులకు కన్వీనర్‌ కోటాలో కేటాయించేలా గత వైఎస్‌ జగన్‌ సర్కారు సంస్కరణలు తెచ్చింది. దీంతో గడిచిన రెండేళ్లలో 7 ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఎందరో పేదింటి విద్యార్థులు మెరుగైన ఉన్నత విద్యను అందుకున్నారు. 

ఈ ఏడాది ప్రైవేటు వర్సిటీలు 9కి చేరడంతో సీట్ల సంఖ్య 7,832కు చేరుకుంది. ఇందులో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో తొలి విడతలోనే 7,700 సీట్లను విద్యార్థులు దక్కించుకున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు వర్సిటీల్లో చదువంటే పేద మెరిట్‌ విద్యార్థులకు సాధ్యయ్యేది కాదు. లక్షల్లో ఫీజులు చెల్లించే వారికే అక్కడ సీట్లు దక్కేవి. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులూ చదువుకోగలుగుతున్నారు.

 

Published date : 20 Jul 2024 11:18AM

Photo Stories