Engineering Counselling 2024:2024–25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌లో 63 వేల సీట్లకు అనుమతి
కాకినాడ : ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు కళాశాలల్లో ప్రవేశాలకు లైన్ క్లియర్ కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో ఇక చివరి దశ సీట్లు, కళాశాల ఎంపికకు సంబంధించి మంగళవారం విద్యార్థుల సెల్‌ఫోన్‌కు సమాచారం రానుంది. రాష్ట్రంలో ఉన్న వర్సిటీల నుంచి సీట్ల సంఖ్యపై ఉన్నత విద్యామండలికి నివేదిస్తేనే అక్కడ నుంచి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుసంధానంతో పాటు సాంకేతిక వర్సిటీల్లో కీలకంగా ఉన్న జేఎన్‌టీయూకే ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేసింది. వర్సిటీ అకడమిక్ అడిట్ డైరెక్టర్ సాయిబాబు నేత్వత్వంలో ప్రక్రియ పూర్తి చేసి నివేదిక పంపించారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లోని కళాశాలలు వర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో శిక్షణ.. చివరి తేదీ ఇదే
సీఎస్‌ఈ వైపు మొగ్గు
2024–25 విద్యాసంవత్సరానికి కాకినాడ వర్సిటీ ఉన్నత విద్యామండలికి సీట్ల కేటాయింపు కోసం నివేదించింది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న 159 కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో 63,000 భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. గత ఏడాది బీటెక్ విభాగంలో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు కోసం నాలుగు వేల సీట్లకు అనుబంధ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా అక్కడి సౌకర్యాలను బట్టి వాటికి అనుమతి ఇచ్చారు. కొత్త కోర్సులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సులకు 1,500 సీట్ల వరకూ అనుమతి ఇచ్చారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ మెయిన్స్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీటు సాధించలేకపోయిన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్‌లో రాష్ట్ర స్ధాయి ర్యాంక్‌లు సాధించారు. వీరు ప్రైవేట్ వర్సిటీలతో పాటు ఏ గ్రేడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
సదుపాయాలు ఉన్న కళాశాలలకే గుర్తింపు
ఉన్నత విద్యామండలి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, కళాశాలల ప్రమాణాలను ఆన్‌లైన్ ద్వారా పరిశీలన చేసి అనుమతి ఇవ్వాలని సూచించింది. ఆ మేరకూ జేఎన్‌టీయూ కాకినాడ నుంచి ఆన్‌లైన్‌లో పరిశీలన నిర్వహించాం. సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించిన, అన్ని వసతులు ఉన్న వాటికే గుర్తింపు కల్పించాం. అటువంటి కళాశాలల్లో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
– డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, తాజా మాజీ వీసీ, జేఎన్‌టీయూ కాకినాడ
ఆన్‌లైన్‌లో కళాశాలల తనిఖీ...
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అనుబంధ కళాశాలల తనిఖీలు ఆన్‌లైన్‌లో చేపట్టారు. మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి – అధ్యాపకుల నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలన చేస్తారు. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజ నిర్ధారణ కమిటీ పర్యవేక్షణ చేస్తుంది. కమిటీ సిఫారసు మేరకు ఏయే కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ కాలేజీలకు ఎన్ని సీట్లుకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజ నిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. ఈ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు.
Tags
- AP EAPCET 2024
- Engineering Admissions
- EAMCET Counselling
- APSCHE
- counselling process and guidance
- Sakshi Education News
- Andhra Pradesh State Council of Higher Education
- Education News
- Kakinada
- CollegeAdmissions
- MobileNotifications
- Admission process
- Student notifications
- College selection
- Final stage of seats
- web options
- Online application
- SakshiEducationUpdates