800 మంది పూర్వ విద్యార్థుల పీహెచ్‌డీలు రద్దు?
నిర్ధిష్ట కాలపరిమితిలో పరిశోధనను పూర్తి చేయని విద్యార్థులకు చివరి అవకాశం కల్పించి నప్పటికీ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోని వారి పీహెచ్‌డీలను రద్దు చేయాలనే యోచనలో విశ్వవిద్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తిగతంగా కోర్టును ఆశ్రయించి థీసిస్ సమర్పించేందుకు అనుమతులు పొందగా...ఆర్థిక స్తోమత లేక కోర్టును ఆశ్రయించని మెజార్టీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యూజీసీ నిబంధనల ప్రకారం ఆరేళ్లలో పీహెచ్‌డీ పూర్తి చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో రెండు దశాబ్దాల్లో సుమారు రెండువేల మంది విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేయలేక పోయారు. ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ పూర్వ విద్యార్థులు పరిశోధనలు పూర్తి చేసుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తూ.. 2021 అక్టోబర్ 31 నుంచి డిసెంబరు 31 లోగా పూర్తి చేయాలని గడువునిచ్చారు. ఆ తర్వాత 2022 మార్చి 31, మరోసారి ఏప్రిల్ 13 వరకు పీహెచ్‌డీ థీసిస్ సమర్పణకు గడువును పొడిగించారు. మొత్తం రెండు వేల మంది పీహెచ్‌డీ పూర్వవిద్యార్థుల్లో 1,200 మంది మాత్రమే థీసిస్‌ను సమర్పించారు. మిగతా 800 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో పీహెచ్‌డీ థీసిస్‌ను సమర్పించలేకపోయారు. దీంతో వారి పీహెచ్‌డీలను రద్దు చేసేందుకు విశ్వవిద్యా లయం చర్యలకు ఉపక్రమించింది.
చదవండి: Higher Education: డిగ్రీతోనే పీహెచ్‌డీలో చేరేలా..!
12 మందికి కోర్టు అనుమతి
నిర్ణీత సమయంలో పీహెచ్‌డీ థీసిస్‌ను సమర్పించని సుమారు 12 మంది విద్యార్థులు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకున్నారు.
దీంతో కోర్టు నుంచి అనుమతులు తీసుకొచ్చిన వారినే థీసిస్ సమర్పించేందుకు వర్సిటీ వర్గాలు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీహెచ్‌డీ చేసేందుకు రూ.2 లక్షలకు పైగా వ్యయమైందని కొత్తగా కోర్టు ఖర్చులు భరించే పరిస్థితుల్లో లేమని పేద విద్యార్థులు పేర్కొంటున్నారు. తమకు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చదవండి: ఈ డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ
చివరి విద్యార్థి వరకు అవకాశం కల్పించాలి
పీహెచ్‌డీ పూర్వవిద్యార్థుల పరిశోధన గ్రంథసమర్పణకు చివరి విద్యార్థి వరకు అవకాశం కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు స్టాలిన్, కె. శ్రీనివాస్ అధికారులను విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరోనా పరిణామాలు వంటి కారణంగా విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేయలేకపో యారని, వర్సిటీ వర్గాలు ఆ విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు.