Degree: డిగ్రీ విద్యార్థులపై ఫీజుల మోత
అయితే, పలువురు విద్యార్థులు వివిధ కారణాలతో డిగ్రీ మధ్యలో ఆపేస్తుండగా, మరికొందరు కొన్ని సబ్జెక్ట్‌లో ఫెయిల్ అవుతారు. అలాంటి వారు కొన్నేళ్ల తర్వాత మళ్లీ పరీక్షలు రాయాలని, డిగ్రీ పట్టా తీసుకోవాలని భావిస్తుండగా, కాకతీయ యూనివర్సిటీ అధికారుల తీరుతో వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. డిగ్రీ అడ్మిషన్‌ను పునరుద్ధరించుకునేందుకు చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజును భారీగా పెంచిన నేపథ్యాన విద్యార్థులు కలలు కల్లలుగా మిగిలిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మూడేళ్ల కోర్సు.. ఆరేళ్లు అవకాశం
డిగ్రీ మూడేళ్లు కోర్సు కాగా, సైన్స్, ఆర్ట్స్ ఇలా రకరకాల కోర్సులను ఎంచుకునే వెసలుబాటు ఉంటుంది. డిగ్రీలో ప్రవేశం పొందిన వారు ఆరేళ్ల లోగా పూర్తి చేయాల్సి ఉంది. అలా పూర్తి చేయని పక్షంలో ప్రాసెసింగ్ ఫీజు(రీ అడ్మిషన్ ఫీజు) చెల్లించడమే కాక ఆ తర్వాత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ ఈసారి ఎవరూ ఊహించని రీతిలో కాకతీయ యూనివర్సిటీ ఫీజులు భారీగా పెంచింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.3వేలుగా నిర్ణయించగా, పరీక్ష ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.4వేలుగా ఖరారు చేశారు. దీంతో ఈ ఫీజు చూసిన వారు డిగ్రీ లేకున్నా పర్వాలేదు అంటూ ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
చదవండి:
‘World Quantum Day’కు ట్రిపుల్ ఐటీ శాస్త్రవేత్తలు
Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
ఇంటర్ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన
ఐదు ప్రభుత్వ కళాశాలలు
ఖమ్మం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ముప్ఫై వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. 2016–17వ సంవత్సరం వరకు సింగిల్ పేపర్ విధానంలో పరీక్షలు నిర్వహించేవారు. 2017–18వ విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి వచ్చింది. సెమిస్టర్ విధానం అమల్లోకి వచ్చాక పాత విద్యార్థులు పెద్దగా దృష్టి సారించలేదు.
ఇప్పుడే ఎందుకంటే..
కొందరు ఎస్సెస్సీ, ఇంటర్ తదితర అర్హతలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యాన రాష్ట్రప్రభుత్వం వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తోంది. ఈపరీక్షల్లో చాలావరకు డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్న వారికే అవకాశం దక్కుతోంది. దీంతో గతంలో డిగ్రీ మధ్యలో వదిలేసిన వారు, కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయిన వారు పూర్తిచేయాలని.. తద్వారా భవిష్యత్‌లో మంచి అవకాశాలు దక్కుతాయనే యోచనకు వచ్చారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా డిగ్రీ అర్హత ఉంటే పదోన్నతులు లభిస్తాయనే భావనతో పరీక్షలు రాయాలని భావిస్తున్నారు. అయితే, వీరిలో చాలామంది డిగ్రీ అడ్మిషన్ తీసుకుని ఆరేళ్లలోగా కోర్సు పూర్తిచేయని వారు ఉన్నారు. వీరు ఇప్పుడు పరీక్షలు రాయాలంటే ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కాకతీయ యూనివర్సిటీ ఫీజులు భారీగా పెంచిన నేపథ్యాన సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు ఆ ఆలోచనను కూడా మదిలోకి రాకుండా తమ ఆశలను వదిలేసుకుంటున్నారు.
వివరాలిలా ఉన్నాయి
- ప్రొసెసింగ్ ఫీజు రూ.3వేలు
- ఒక్కో సబ్జెక్ట్‌కు ఫీజు రూ.4వేలు
- చివరి తేదీ ఏప్రిల్ 25
- రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 29