యువతకు ‘ఉపాధి’ పెంచడమే లక్ష్యం
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏపీ అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ సామ్యూక్ విశ్వవిద్యాలయాన్ని బృందం సందర్శించింది. ఒకేషనల్ విద్యకు సంబంధించి అవసరమైన సహకారం అందించేందుకు సామ్యూక్ వర్సిటీ ముందుకు వచ్చిందని మంత్రి బుగ్గన తెలిపారు. కొరియన్ భాష నేర్చుకోవడం వల్ల ప్లేస్‌మెంట్లను మరింతగా పెంచవచ్చన్నారు. ఇందుకోసం ఏపీలో కొరియన్ లాంగ్వేజ్ ల్యాబ్‌ల ఏర్పాటుపై వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్‌తో బుగ్గన చర్చించారు.
చదవండి: Skill Development Corporation: స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం
అనంతరం కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ(కొట్రా) ప్రతినిధులను బుగ్గన నేతృత్వంలోని బృందం కలిసింది. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారం అందిస్తామని కొట్రా హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. కొట్రాకు బెంగళూరులో కార్యాలయం ఉందని.. అక్కడి నుంచి పూర్తి సహకారం అందిస్తామని కొట్రా డైరెక్టర్ జనరల్ తెలిపినట్లు పేర్కొన్నారు. కొట్రా డైరెక్టర్ జనరల్ హియో జిన్వోన్ మాట్లాడుతూ.. తమ ప్రతినిధులు ఏపీకి వచ్చి అవసరమైన సహకారం అందిస్తారని చెప్పారు. అనంతరం ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొరియా(ఐసీసీకే) గ్లోబల్ సీఎఫ్‌వో పంకజ్ శ్రీవాస్తవతో పాటు ఇతర ప్రముఖులతోనూ బుగ్గన భేటీ అయ్యారు.
చదవండి: ITI, Polytechnic: కోర్సుల్లో సమూల మార్పులు
ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మరింతగా కలిసి పనిచేసే అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇందుకు ఐసీసీకే సానుకూలంగా స్పందించింది. అలాగే దక్షిణ కొరియాలోని భారత రాయబారి హెచ్‌ఈ అమిత్‌కుమార్‌తో కూడా బుగ్గన బృందం సమావేశమైంది. ఏపీ ఆర్థికాభివృద్ధికి అవసరమైన అంశాలలో దక్షిణ కొరియా భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చించారు. దక్షిణ కొరియా వ్యాపార విస్తరణకు అవసరమైన ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీ సంసిద్ధతతో ఉందని బుగ్గన ఈ సందర్భంగా తెలిపారు.
చదవండి: Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది?
ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు సహా సీ ఫుడ్‌పై మరింత అవగాహన పెంచే బ్రాండింగ్ అంశంలో సహకరిస్తామని అమిత్ కుమార్ చెప్పారు. ఈ సమావేశాల్లో ఏపీ ఉన్నతాధికారులు ఎస్‌ఎస్ రావత్, కె.సునీత, సురేశ్ కుమార్, వినోద్ కుమార్, సామ్యూక్ వర్సిటీ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్ జియెన్ షిన్, కొట్రా డైరెక్టర్ చో ఈనం, డిప్యూటీ డైరెక్టర్ జో యాండ్, రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ హాంగ్ చంగ్సేక్, అసిస్టెంట్ మేనేజర్ పార్క్ మనిజోంగ్, బీకేఎల్ పార్టనర్ జాంగ్, టాగివ్ సీఈవో పంకజ్ అగర్వాల్, సేజ్ స్ట్రాటజీస్ సీఈవో ఇంబం చోయ్ తదితరులు పాల్గొన్నారు.