Skip to main content

ITI, Polytechnic: కోర్సుల్లో సమూల మార్పులు

సాక్షి, విశాఖపట్నం: ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు.
ITI, Polytechnic
ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సమూల మార్పులు

ఈ విద్యా సంవత్సరం నుంచి రీస్ట్రక్చర్‌తో పాటు సిలబస్‌ను రీడిజైన్‌ చేస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 28న విశాఖలో జరిగిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ (ఫ్యాప్సీ) ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌–2023 సన్నాహక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసిన వారు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆటోమొబైల్‌ రంగాల్లో వీరు తమ నైపుణ్యంతో రాణించేలా తయారు చేస్తామని చెప్పారు. వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐటీఐల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కోసం 2023లో  బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 192 స్కిల్‌ హబ్‌ల్లో మెరికలు తిరిగే కోర్సులను డిజైన్‌ చేశామని, వీటి ద్వారా వేలాది మంది యువతకు నైపుణ్య శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. అర్హులైన పారిశ్రామికవేత్తలకు ఫ్యాప్సీ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. కొత్త పారిశ్రామిక పాలసీలో కొన్ని మార్పులు చేయాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి అవసరమైతే మార్పులు చేస్తామని చెప్పారు.

చదవండి: Polycet: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఇలా చేస్తే ఫ్రీగా పాలీసెట్‌ కోచింగ్.. పూర్తి వివ‌రాలు ఇవే

రాష్ట్రంలో వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఇండస్ట్రియల్‌ హోదా కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్కులను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మే 3న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధిలో వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కీలకపాత్ర ఉందన్నారు. ఫ్యాప్సీ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి కరుణేంద్ర మాట్లాడుతూ ఫ్యాప్సీ ఎక్స్‌లెన్స్‌–2023 అవార్డుల కోసం జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 11 కేటగిరీల్లో ఈ అవార్డులుంటాయని, ఈ అవార్డులు ఇవ్వడానికి 11 మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు ఆఖరు లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రదానం చేస్తామని చెప్పారు.అనంతరం అవార్డుల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు, మాజీ అధ్యక్షుడు అచ్యుతరావు, ఎఫ్‌టీసీసీఐ సీఈవో ఖ్యాతి తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

Published date : 29 Apr 2023 05:01PM

Photo Stories