Admission in Medical College: ఏలూరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు షురూ
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఆధారంగా జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీలో సీట్ల కేటాయింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి కోటాలో భాగంగా ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో 15 శాతం సీట్లు భర్తీ చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే ఏలూరు మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు చేపట్టడం తెలిసిందే.
22 మందికి సీట్లు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తాజాగా ఆల్‌ఇండియా కోటాలో 22 మంది మెడికల్ విద్యార్థులకు సీట్లు కేటాయించారు. జాతీయ స్థాయిలో 15,503 ర్యాంకర్ ఏలూరు మెడికల్ కాలేజీలో సీటు కోరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక త్వరలోనే రాష్ట్రంలో మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంటున్నారు. ఆగస్టులో డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ మూడు ఫేజుల్లో చేపట్టే సీట్ల భర్తీలో ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 150 సీట్లలో 22 సీట్లు ఇప్పటికే భర్తీ చేయగా మరో 128 సీట్లను వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనుంది. అలాగే ప్రభుత్వ కోటాలో 50 శాతం సీట్లు భర్తీ చేస్తారు. ఇక 30 శాతం మేర సీట్లు బీ కోటాలోనూ, మరో 20 శాతం సీట్లు సీ కేటగిరీలోనూ భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.