KG to PG Admissions: ‘వసతి’ లేక నిరాశ
అడ్మిషన్ల కోసం గంభీరావుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, మాచారెడ్డి, దుబ్బాక, బీబీపేట, దోమకొండ మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు కేజీ టు పీజీలో అడ్మిషన్లు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
హాస్టల్ సౌకర్యం లేక..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు వసతి గృహ సౌకర్యం లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. పాఠశాలలో చదివిస్తే పిల్లలు ఎక్కడ ఉండాలనేది ప్రశ్నార్థకంగా మారింది. హాస్టల్ సదుపాయం లేకపోవడంతో అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతేడాది కూడా ఆసక్తిగా వచ్చినవారు వసతి లేక నిరాశతో వెనుదిరిగారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. బస్సులు, ఆటోలు కూడా వెళ్లని గ్రామాలు ఉన్నాయి.
చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
అడ్మిషన్లు పెరిగే అవకాశం
గంభీరావుపేట కేజీ టు పీజీ ప్రాంగణంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కానీ హాస్టల్ సౌకర్యం లేకపోవడం దానికి అడ్డంకిగా మారింది. కేజీ టు పీజీలో భాగమైన జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థినుల కోసం గతేడాది హాస్టల్ ప్రారంభించారు. పాత గర్‌ల్స్ హాస్టల్‌లోనే కొనసాగిస్తున్నారు. కానీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ లేదు.
మండలంలో ఎస్సీ వసతి గృహం మాత్రమే ఉంది. వారిని మినహాయిస్తే బీసీలు, మైనార్టీలు, ఓబీసీలు, ఎస్టీలకు హాస్టల్‌లో సీట్లు లభించడం లేదు. అలాగే గతంలో బాలికల హాస్టల్, బీసీ హాస్టళ్లు గంభీరావుపేటలో ఉండేవి. విద్యార్థుల నమోదు లేని కారణంగా వాటిని మూసేశారు.
బీసీ హాస్టల్ భవనాలు నిరుపయోగంగానే ఉంటున్నాయి.
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపి కేజీ టు పీజీ ప్రాంగణానికి అనుబంధంగా అన్నివర్గాల వారికి హాస్టల్ సదుపాయం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా వేలాది మంది విద్యార్థులతో ప్రాంగణం కళకళలాడే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మారుమూల గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
హాస్టల్ సౌకర్యం కల్పించాలి
గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్యాసంస్థలకు అనుగుణంగా బాలబాలికల కోసం వేర్వేరుగా హాస్టల్ సౌకర్యం కల్పించాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు హాస్టల్ లేక అడ్మిషన్లు పొందలేకపోతున్నారు. సకల సౌకర్యాలతో కేజీ టు పీజీ నిర్మించారు. కానీ అడ్మిషన్లు పెరగాలంటే హాస్టల్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి.
– కల్యాణ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు