పేదరికంపై ప్రతిభతో ‘‘దండెత్తాడు’’- అంగూరు శివాజీ, సివిల్స్ విజేత
పేరుకే రైతు.. ఇంట్లో అన్నీ కష్టాలే
శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలోని లోహరిజోల గ్రామంలో రైతు కుటుంబం మాది. రాజాంలో బీఎస్సీ; తర్వాత హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేశా. అప్పటికే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నా.. వ్యవసాయంలో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత. కొన్నాళ్లు ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేశా. ఆర్థిక ఇబ్బందులున్నా.. అమ్మానాన్న సివిల్స్ లక్ష్యాన్ని కొనసాగించమని ప్రోత్సహించారు.
అదే ధైర్యం.. సివిల్స్ వైపు పయనం:
ఎంత కష్టపడైనా సివిల్స్ సాధించాలని నిశ్చయించుకున్నాను. సివిల్స్ అసాధ్యం కాదు అని అనుక్షణం నాకు నేనే ప్రోత్సహించుకున్నాను. ఎంబీఏతో వచ్చిన ఉద్యోగాలు జీవనాధారం చూపినా సమాజానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కలగలేదు. దీంతో సివిల్స్‌తోనే అవి సాధ్యమని భావించాను. మొదటి ప్రయత్నం (2010)లో విఫలమైనా వెరవలేదు.
రెండో ప్రయత్నంలో విజయం:
రెండో అటెంప్ట్ (2011) కోసం కోచింగ్ తీసుకున్నా. సివిల్స్‌లో ప్రశ్నలను లోతుగా అడుగుతుండడంతో ప్రామాణిక పుస్తకాలను ఫాలో అయ్యాను. ఎక్కువగా బేసిక్స్ నుంచే వస్తుండడంతో ముందు బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌పై దృష్టి సారించాను. అనుక్షణం ఇంట్లో ఆర్థికపరిస్థితి గుర్తు చేసుకుని పట్టుదలగా చదవడం మొదలుపెట్టా. రెండో ప్రయత్నంలో సివిల్స్ రాకుంటే.. ఇక ఆ ప్రయత్నం విరమించి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం బోధన
రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవశాత్తూ రోజుకు 8 గంటలకుపైగా ప్రిపరేషన్‌తో ప్రిలిమ్స్‌లో నెగ్గాను.
ప్రిలిమ్స్ విజయం.. రెట్టింపైన ధైర్యం.
ప్రిలిమ్స్‌లో సాధించిన విజయం ధైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచింది. మెయిన్స్‌లో ఎలాగైనా విజయం సాధించాలన్న కసిని పెంచింది. ఆప్షనల్స్ ఎంపిక నుంచి ప్రిపరేషన్ వరకు చాలా జాగ్రత్తగా అడుగులు వేశా. హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకుని మంచి మెటీరియల్ సేకరించుకున్నాను. ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్స్‌బుక్స్, ఆంగ్ల పత్రికలు, మేగజైన్లు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ మేగజైన్లు, హిస్టరీ సబ్జెక్టుకు ఆర్‌ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర, నార్మన్‌లోమ్ పుస్తకాలు చదివాను. మొత్తం ప్రిపరేషన్‌లో లోపం టైం మేనేజ్‌మెంట్ చాలా కీలకమని గుర్తించకపోవడమే. అయినా మెయిన్స్‌లో 915 మార్కులు రావడంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించాను.
నక్సలిజం నుంచి హాబీల వరకు:
ఇరవై నిమిషాల ఇంటర్వ్యూలో.. నక్సలిజం ఆవిర్భాం? దాని నేపథ్యం? సమస్యకు పరిష్కారం? ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చర్యలు? నక్సలిజం గురించి తెలిసింది చెప్పండి? శాంతి భద్రతలకు నక్సలిజం వల్ల కలిగే విఘాతం ? సమస్యకు పరిష్కారం? మీ హాబీలు? వంటి ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను. ఫలితంగా 300 మార్కులకు 165 మార్కులు పొందాను.
656వ ర్యాంకు సాధించాను.
మొత్తం 1080 మార్కులతో 656వ ర్యాంకు లభించింది. ఈ ర్యాంకుకు ఐఆర్‌ఎస్ లేదా ఐఆర్‌టీఎస్ లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఇంతవరకు రావడం సాధారణమేమీ కాదు. అందుకే వచ్చిన సర్వీస్‌లో చేరి ఆ తర్వాత ఐఏఎస్ కోసం కృషి చేస్తాను.
పేదరికంతో కుంగిపోతే... పైకిరాలేం
గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో సివిల్స్ సాధించాలని కలలు కంటారు. ఇది తప్పుకాదు.0.005 శాతం మాత్రమే సక్సెస్ రేటుండే సివిల్స్ వంటి పోటీ పరీక్షల్లో విజయం అంత సుల భం కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం ప్రిపరేషన్ చేస్తేనే విజయం వరిస్తుంది. అందుకే ఆర్థికంగా కొంచెమైనా భరోసా ఉంటేనే ప్రిపరేషన్ సాగించవచ్చు. పేద విద్యార్థులకు ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ చేయూతనిస్తున్నాయి.
ఎంతసేపు చదివామన్నదికాదు...
ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ప్రిపరేషన్ సబ్జెక్టులపై ఫోకస్డ్‌గా ఉండాలి. గంట చదివినా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. చదివింది గంటైనా ఇష్టపడి చదవాలి. ‘నేను రాణించగలను’ అనే దృక్పథమే సగం విజయానికి మూలం. ప్రిలిమ్స్ సిలబస్‌లో మార్పుల నేపథ్యంలో పుస్తకంలో చదివింది మాత్రమే అడగకపోవచ్చు. అందుకే సబ్జెక్టుతోపాటు విశ్లేషణాత్మకంగా, పట్టుసాధించేలా ప్రిపరేషన్ సాగిస్తే విజయం తథ్యం.