Skip to main content

Mahesh Bhagawath IAS: ఇటు విధులు నిర్వహిస్తూనే...మ‌రోవైపు..

విధి నిర్వహణలో వారికి వారే సాటి. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతూనే.. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ పోరులో వారు పోషిస్తున్న పాత్ర అపురూపం.

రాత్రింబవళ్లూ ప్రజాసేవలో తరిస్తున్నారు ఈ పోలీస్‌ బాస్ రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు విధి నిర్వహణలోనూ తమదైన విభిన్నత చాటుతున్నారు. సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.ఈయ‌న‌ సేవాభావాన్ని చూసి వీరి సతీమణి సైతం కొనియాడుతున్నారు. వీరి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలకు, కుటుంబానికి సమయం కేటాయించడంలేదనే భావన ఉన్నా.. ప్రజల కోసం పని చేస్తుండడం గర్వంగా ఉందని చెబుతున్నారు.. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ సతీమణి సునీతా భగవత్‌ తమ మనోగతాన్ని ఇలా పంచుకున్నారు...

మహేశ్‌ ది గ్రేట్‌..ఎందుకంటే..?
ఓ ఐపీఎస్‌గా ఆయన సేవలకు సెల్యూట్‌ చేస్తున్నా. ప్రస్తుతం రంగారెడ్డి ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా పనిచేస్తున్నాను. విధి నిర్వహణలో సామాన్యులకు అండగా ఉండటం నచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో సొంతూళ్లకు వెళ్లలేని వలస కార్మికులను గుర్తించి వారికి సహయం అందించడంలో మహేష్‌ భగవత్‌ నేతృత్వంలోని బృందం ముందుండడం అభినందనీయం. లాక్‌డౌనే కాదు పండగలు, నూతన సంవత్సర వేడుకలు.. ఇలా ఏదైనా ఫ్యామిలీతో అందరూ చేసుకుంటుంటే పోలీసులు మాత్రం ఆ రోజుల్లో విధుల్లో బిజీగా ఉంటారు. ఇలా ఏ ఆపద వచ్చినా ముందుండే పోలీసులకు కృతజ్ఞతలు.

కుటుంబ‌ నేపథ్యం..
ఇక మా ఫ్యామిలీ విషయానికొస్తే చిన్న పాప ‘అతవరి’కి డాడీ ఎంతో ఇష్టం. సాయంత్రం సమయంలో ఎప్పుడూ వస్తున్నారని అడుగుతూటూంది. అయితే నాన్నను చూపి ప్రేరణ పొందిన అతవరి ఇండస్‌ అక్షన్‌ అనే ఎన్జీఓకు వలంటీర్‌గా సేవలు అందిస్తోంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి సహయం అందిందా? లేదా? అని ఫోన్‌కాల్స్‌ చేసి అడుగుతుంది. అవసరమైతే వాళ్లకు మార్గదర్శనం చేస్తుండడంతో మావారు ఎంతో సంతోషపడుతున్నారు. ఇక పెద్దపాప మైత్రేయి అమెరికాలోని న్యూజెర్సీలోనే ఉండడంతో ప్రతిరోజూ ఇంటికి వచ్చాక ఓ గంటపాటు వాట్సాప్‌ వీడియో కాల్‌ చేసి కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఓవైపు పోలీసింగ్, మరోవైపు ఫ్యామిలీని సమన్వయం చేస్తుండడం చూస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ముఖ్యంగా ఆదివారం రోజున తనకు నచ్చిన ఆమ్లెట్, ఉప్మా చేస్తుంటారు. ఒత్తిడి నుంచి బయట పొందేందుకు మ్యూజిక్‌ వింటారు. ముఖ్యంగా దుర్గా జస్‌రాజ్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ షో మ్యూజిక్‌ వారంలో రెండుసార్లైనా వింటారు.

ఇటు విధులు నిర్వహిస్తూనే ఫ్యామిలీని...
కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదు. లాక్‌డౌన్‌ ముందు బిజీ షెడ్యూల్‌ ఉన్న ఫ్యామిలీకి బాగానే సమయం కేటాయించేవాణ్ణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రాత్రి ఇంటికి చేరుకున్నాక అమెరికాలో ఉంటున్న మా పెద్ద కుమార్తెకు వీడియో కాల్‌ చేస్తున్నా. మహారాష్ట్రలో ఉంటున్న మా నాన్నతో కూడా మాట్లాడుతున్నా. ఇటు విధులు నిర్వహిస్తూనే ఫ్యామిలీని చూసుకుంటున్నా.
– మహేష్‌ భగవత్, రాచకొండ సీపీ

Published date : 21 Sep 2021 02:16PM

Photo Stories