Skip to main content

UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై న‌డిచేలా చేశాయ్‌.. నా వైకల్యం కారణంగా..

త‌న తోటి మిత్రులతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన అతడి బాల్యం ఆసుపత్రులు.. శస్త్రచికిత్సలతో గడిచిపోయింది. ఎనిమిదేళ్లకే కండరాల బలహీనత. అవయవాల పనితీరు స్తంభించిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.
Kartik kansal upsc ranker
కార్తిక్‌ కన్సల్‌

ఆ పాడు వ్యాధి అవయవాలను మింగేస్తూ.. శరీరాన్ని కదలనీయకుండా చేసినా.. అతడి ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. త‌ను అనుకున్న ల‌క్ష్యాన్ని మాత్రం ప‌ట్టుద‌ల‌తో సాధించుకున్నారు.

ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఇస్రోలో పనిచేస్తున్నాడు కార్తిక్‌ కన్సల్‌. వీల్‌ చైర్‌లోనే ఆఫీస్‌కు వచ్చి తన విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవ‌ల యూపీఎస్సీ విడుద‌ల చేసిన ఫలితాల్లో అతడు 271వ ర్యాంకు సాధించారు. తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం అడ్డు కాదని.. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మనదే అని నిరూపించాడు.

లేవలేని స్థితిలోనైనా..

Kartik kansal real life story

కార్తిక్‌ కన్సల్‌ ఎనిమిదేళ్లున్న సమయంలో కండరాలు బలహీనమయ్యే మస్క్యులర్‌ డిస్ట్రఫీ వ్యాధి బారిన పడ్డాడు. పలు శస్త్రచికిత్సలు, వ్యాయామాలతో కోలుకున్నప్పటికీ లేచి నిల్చోలేని పరిస్థితి. దీంతో వీల్‌చైర్‌కే పరిమితయ్యాడు. కానీ, లేవలేని స్థితిలోనైనా పట్టుదల ప్రదర్శించాడు. అనారోగ్యం, అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంటూ చదువుల్లో రాణించాడు. 

2018లో ఐఐటీ రూర్కీలో విద్యాభ్యాసం పూర్తి చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌తో సహా అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. అయినా అంగవైకల్యం కారణంగా ప్లేస్‌మెంట్ పొందలేకపోయాడు.

సివిల్స్ ప్ర‌య‌త్నం ఇలా..

Success Story

2019లో సివిల్స్‌ తొలి ప్రయత్నంలోనే కార్తిక్‌ 813 ర్యాంకు సాధించాడు. కానీ మరిన్ని మార్కులు పెంచుకుని అడ్మినిస్ట్రేటివ్ పోస్టు సాధించాలనుకున్నాడు. కానీ 2020లో మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. 2021లో మూడో ప్రయత్నంలో 271వ ర్యాంకుతో మెరిశాడు. యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు చేతి వేళ్లు సహకరించకపోవడంతో మూడు నెలలపాటు ప్రతిరోజు నాలుగు గంటలు సాధన చేశాను అని కార్తిక్‌ తెలిపాడు. 

ఇస్రోలో పనిచేస్తూనే.. పనిదినాల్లో ఉదయం రెండు గంటలు, ఆఫీస్‌ నుంచి వచ్చాక 6.30 నుంచి రాత్రి 11 గంటలపాటు యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు చదువుకునేవాడినన్నారు. వారాంతరాల్లో మరింత సమయం కేటాయించినట్లు వివరించాడు. తన ఈ జర్నీలో అమ్మ పాత్ర ఎంతో ఉందని, ఆమె సహకారంతోనే ఇదంతా సాధ్యమైనట్లు చెప్పుకొచ్చాడు.

నా వైకల్యం కారణంగా నేను ఆ పోస్టుకు..

Kartik kansal upsc ranker real story in telugu

అలాగే కార్తిక్ ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ వివక్షే తనలో స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నాడు. నేను ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ బాగా రాశాను. కానీ మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయా. నా వైకల్యం కారణంగా నేను ఏ పోస్టుకు కూడా అర్హత పొందలేదని తెలిసింది. అప్పుడు ఎంతో క్షోభకు గురయ్యా. కానీ.., మానసికంగా బలంగా ఉన్నా.. శారీరకంగా నాలా ఉన్నవారికి ఇలాంటివి ఆటంకం కలిగిస్తున్నాయని తెలుసుకున్నా. ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై దృష్టిపెట్టేందుకు దారితీసింది. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అప్పుడే దృఢంగా నిర్ణయించుకున్న అన్నారు.

Published date : 12 Nov 2022 05:46PM

Photo Stories